బీఆర్ఎస్ యువ నాయకురాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు. (Secunderabad Cantonment BRS MLA Lasya Nanditha passes away). తండ్రి సాయన్న మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. తన మొదటి ప్రయత్నంలోనే విజయం సొంతం చేసుకున్నారు.
MLA Lasya Nanditha : రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. యువ రాజకీయ నాయకురాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో చనిపోయారు. ఈ ఘటనలో డ్రైవర్ కు కూడా గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించి, చికిత్స అందిస్తున్నారు.
undefined
మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపు..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటి సారిగా ఆమె పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. తండ్రి మరణంతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీఆర్ఎస్ నాయకుడైన సాయన్న కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే గతేడాది గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కూతురు లాస్యకు బీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించింది.
ఎస్సీ రిజర్వ్డ్ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో కాంగ్రెస్ నుంచి విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల, బీజేపీ నుంచి శ్రీగణేశ్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో శ్రీగణేశ్ పై లాస్య నందిత 17,169 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. నియోజకవర్గానికి తండ్రి సాయన్న చేసిన సేవలే ఆమె గెలుపులో కీలక పాత్ర పోషించాయి.
దీంతో ఆమె తన 37 ఏళ్ల వయస్సులో తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న లాస్య నందిత, చిన్న వయస్సులో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై నాయకులు విచారం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న ఆమె ఇలా హఠాన్మరణానికి గురికావడం పట్ల నియోజకవర్గ ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.