CM Revanth Reddy: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ సాగు నీటికి నీరు తరలించకుండా చూడాలనీ, అవసరమైన తాగు నీటి విడుదలకు కేఆర్ఎంబీకి లేఖ రాయాలని సూచించారు. నిరుపయోగంగా నీటి వనరులను పునరుద్ధరించాలని అన్నారు.
CM Revanth Reddy: వేసవి కాలంలో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని, ఇందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. వర్షాభావంతో జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో తాగు నీటి సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి సాగు నీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, తాగు నీటి సరఫరా శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు.
తొలుత రాష్ట్రంలో జలాశయాల్లో నీటి నిల్వలు, తాగు నీటికి అవసరమైన నీటి పరిమాణంపై అధికారులు గణాంకాలు వివరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. నగరాలు/పట్టణాలు, పల్లెలు,తండాలు, గూడేలు, ఎస్సీ కాలనీలు అనే తేడా లేకుండా ప్రతి నివాస ప్రాంతానికి తాగు నీరు అందేలా సాగు నీరు, పట్టణాభివృద్ధి, పురపాలక, పంచాయతీరాజ్, తాగు నీటి సరఫరా శాఖల సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తాగు నీటి కోసమంటూ నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ 9 టీఎంసీలకుపైగా నీరు తీసుకుపోతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంత పెద్ద మొత్తంలో తాగు నీరు ఎక్కడ వినియోగిస్తున్నారని, సరైన గణాంకాలు తీసుకొని ఇతర అవసరాలకు నీరు తీసుకుపోకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగు నీటికి నీరు తీసుకోవాలంటే కృష్ణా నది యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) లేఖ రాయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంత నీరు అవసరమో సమగ్రంగా సమీక్షించి వెంటనే కేఆర్ ఎంబీకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో ఏప్రిల్ నెలాఖరు, మే నెలలో వచ్చిన వర్షాలతో జూరాలకు నీరు రావడంతో ఇబ్బంది రాలేదని, లేకుంటే నారాయణపూర్ జలాశయం నీరు విడుదల కోరుతూ కర్ణాటకను అభ్యర్థించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
గతంలో ఎప్పుడైనా అలా తీసుకున్నారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా మూడేళ్ల క్రితం తీసుకున్నామని తెలిపారు. అయితే దానిని చివరి అవకాశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ముందుగా కేఆర్ఎంబీకి లేఖ రాయాలని సూచించారు. నూతన పథకాలు వచ్చిన తర్వాత గతంలో ఉన్న అనేక నీటి వనరులను వదిలేశారని, ప్రస్తుతం వాటిని వినియోగంలోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.