
హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్ జలమయమైంది. వాతావరణ శాఖ ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో మూడు రోజులపాటు అంటే ఈ నెల 25వ, 26వ, 27వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తల చర్యల కోసం సమాలోచనలు చేస్తున్నది. ఇందులో భాగంగా పాఠశాలలకు సెలవు ఇవ్వాలనే ఆలోచనలు చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గతవారం కూడా మంగళవారం ఉదయం వర్షం కారణంగా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పుడు చివరి నిమిషంలో సెలవులు ప్రకటించడంతో చాలా మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి వెనుదిరగాల్సి వచ్చింది.
పాఠశాల సమయాల్లో మార్పులు
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల వేళల్లో మార్పులు చేసింది. ఈ మార్పులు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేస్తాయి. అదే ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నడుస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ మార్పులు, హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రవ్యాప్త స్కూళ్లకు వర్తిస్తాయి.
Also Read: హైద్రాబాద్ లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్ జాం
వర్షాల కారణంగా ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తే.. ఈ మార్పులు మళ్లీ స్కూల్ పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి అమల్లోకి వస్తాయని అర్థమవుతున్నది.