వారి ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Nov 26, 2019, 4:53 PM IST
Highlights

యూనియన్ నాయకులేనని చెప్పడంతో ఆర్టీసీ కార్మికుల మరణాలకు వాళ్లే బాధ్యత వహించాలని సూచించింది. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది. ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.  
 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తీరువల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం నిర్ణయం వల్లే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నారనడానికి ఆధారాలు ఇవ్వాలని సూచించింది. 

ఆర్టీసీ ఉద్యోగులను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడా చూపించలేదు  కదా అని ప్రశ్నించింది. ఆత్మహత్య చేసుకోవడానికి, గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని అలాంటిది ప్రభుత్వం కారణంగానే చనిపోయారని ఎలా అంటామని ప్రశ్నించింది. 

ప్రభుత్వం కార్మికులను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించడం వల్లే ఆత్మహత్యలు చేసుకున్నారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కార్మికులను డిస్మిస్ చేసినట్లు ప్రభుత్వమేమీ ప్రకటించలేదని హైకోర్టు పేర్కొంది.  

RTC STrike:మరోసారి వెనక్కు తగ్గిన జేఎసీ, సమ్మె విరమణ

ప్రభుత్వం తీరు వల్లే ఆత్మహత్యలు చేసుకున్నారని అందుకు ఆర్టీసీ కార్మికుల సూసైడ్ నోట్ లే ఆధారమని కోర్టు ముందుంచారు పిటిషనర్ తరపు న్యాయవాది. సూసైడ్ నోటీసులను పరిశీలించిన ధర్మాసనం సమ్మెకు పిలుపు ఇచ్చింది యూనియన్ నాయకులేనా అని అడిగింది. 

యూనియన్ నాయకులేనని చెప్పడంతో ఆర్టీసీ కార్మికుల మరణాలకు వాళ్లే బాధ్యత వహించాలని సూచించింది. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది. ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.  

అయితే ఇప్పటికైనా ఆర్టీసీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని పిటీషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళ్తే అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల కార్మికులు మరింతమంది ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉందని పిటీషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.  

డిపోలకు వెళ్తే అరెస్ట్ చేస్తున్నారని కూడా సూచించారు. డిపోలోకి అనుమతి ఇవ్వకపోతే మరో అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

కార్మికులకు షాక్: అంతా మీ ఇష్టమేనా.. విధుల్లోకి తీసుకునేది లేదన్న ఆర్టీసీ ఎండీ

click me!