బతుకంతా బ్లాక్ మెయిలింగే: రేవంత్‌పై బాల్కసుమన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 2, 2020, 6:43 PM IST
Highlights

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ బాల్కసుమన్ మండిపడ్డారు. కేటీఆర్ ఫాంహౌస్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. 

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ బాల్కసుమన్ మండిపడ్డారు. కేటీఆర్ ఫాంహౌస్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎలుకను పట్టుకోవడానికి వెళ్లిన రేవంత్ ఏమీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.

తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ఎంపీ డ్రామాలు ఆడుతున్నారు. దళితుల భూమిని రేవంత్ బ్రదర్స్ అక్రమంగా లాక్కున్నారని.. ఇష్టం వచ్చినట్లుగా వీరి పేరు మీదకు బదిలీ చేయించుకున్నారని సుమన్ ఆరోపించారు.

రేవంత్ అక్రమాలపై బాధితులు కలెక్టర్, ఆర్డీవోలతో పాటు మీడియాకు సైతం తమ గోడు వెల్లబోసుకున్నారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. వాల్టా చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ భూములతో పేదల భూములను కబ్జా చేసి... రేవంత్ కబ్జా కోరుగా మారారని సుమన్ మండిపడ్డారు.

Also Read:రేవంత్ రెడ్డి జిమ్మిక్కు: భూదందా ఆరోపణలపై చెప్తానని, మధ్యలో అదృశ్యమై...

రేవంత్ నిజస్వరూపం ప్రజాక్షేత్రంలో బట్టబయలు కావడంతో దాని గురించి చెబుతానని విలేకరులను ఇంటికి పిలిచారని సుమన్ చెప్పారు. శంకరపల్లిలో కేటీఆర్ అక్రమంగా ఫాం హౌస్ కట్టారని దొంగే దొంగ అన్నట్లుగా బురదజల్లే కార్యక్రమానికి దిగారని ఆయన విమర్శించారు.

శంకర్‌పల్లిలో కేటీఆర్ ఫాంహౌస్‌ను లీజుకు తీసుకున్నారని.. దీనికి అగ్రిమెంట్ ప్రకారం డబ్బు చెల్లిస్తున్నారని బాల్కసుమన్ స్పష్టం చేశారు. రేవంత్ బతుకంతా చీకటి బ్రతుకేనని, బ్లాక్‌మెయిలింగ్ పాలిటిక్సేనని సుమన్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెబుతున్న భూమి విషయాన్ని కేటీఆర్ 2014, 2018 ఎన్నికల అఫిడవిట్‌లోనే పొందుపరిచారని చెప్పారు.

భూముల అక్రమాలపై మీడియాలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఒక్కదానికి కూడా రేవంత్ రెడ్డి ఎందుకు వివరణ ఇవ్వడం లేదని బాల్కసుమన్ ప్రశ్నించారు. రేవంత్ లాంటి నేతల పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాల్కసుమన్ సూచించారు.

Also Read:కేటీఆర్‌దంటూ ఆరోపణ: జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నాయకుల బూట్లు నాకిన కొందరు వ్యక్తులు ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చూడలేకపోతున్నారని బాల్కసుమన్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి బండారం త్వరలోనే బయటపడుతుందని .. బ్లాక్ మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన సెటైర్లు వేశారు.

పట్టణ ప్రగతికి పోటీగా పట్నం గోస అని పెట్టారని.. పట్నం నరేందర్ రెడ్డి ఓడించాడు కాబట్టే ఆయన పేరును మరచిపోలేకే రేవంత్ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని బాల్కసుమన్ చెప్పారు. 

click me!