తెలంగాణకు ముందే మిషన్ కాకతీయకు రూపకల్పన: కేసీఆర్

By narsimha lodeFirst Published Jun 20, 2021, 2:59 PM IST
Highlights

తెలంగాణలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని రైతులు పండించారని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. పంజాబ్ కంటే వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణలో అగ్రగామిగా ఉందన్నారు. పంజాబ్ లో 2 కోట్ల 2 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే  మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసినట్టుగా ఆయన తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని రైతులు పండించారని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. పంజాబ్ కంటే వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణలో అగ్రగామిగా ఉందన్నారు. పంజాబ్ లో 2 కోట్ల 2 లక్షల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే  మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసినట్టుగా ఆయన తెలిపారు.సిద్దిపేటలో పలు అభివృద్ది కార్యక్రమాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 

ALSO READ:సిద్దిపేటలో కొత్త కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్

పరిపాలన సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొన్నామన్నారు. కొత్త జిల్లాలకు అవసరమైన భవనాల ఏర్పాటు ప్రక్రియలో తొలుత సిద్దిపేటలోనే  జిల్లా కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయం ప్రారంభించుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.  సిద్దిపేటతో పాటు మరో మూడు జిల్లాల్లో వెటర్నరీ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.   గతంలో సాగు, తాగు నీటి కోసం అనేక కష్టాలు పడిన  విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఓ సబ్ స్టేషన్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చాలా అదృష్టవంతులని చెప్పారు. బిస్కట్ల కన్నా సులభంగా విద్యుత్ సబ్ స్టేషన్లు ఎమ్మెల్యేలు చెబితే వస్తున్నాయన్నారు. మే మాసంలో సిద్దిపేట నియోజకవర్గంలో చెరువులన్నీ అలుగులు పోస్తున్నాయన్నారు. ఇందుకోసమే తెలంగాణ కోరుకొన్నామని ఆయన  వివరించారు. 

తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే  ఎక్కడి నుండి పని ప్రారంభించాలనే దానిపై ప్రోఫెసర్ జయశంకర్,  సీడబ్ల్యుసీ మాజీ సభ్యుడు ఆర్ విద్యాసాగర్ రావు, తాను రోజుల తరబడి కసరత్తు చేశామని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ రావడానికి  నాలుగు మాసాల ముందే  చెరువుల పునరుద్దరణ గురించి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్టుగా ఆయన తెలిపారు. తెలంగాణలో ఆనాడు పాలించిన కాకతీయ రెడ్డి రాజులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారన్నారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్దరించే కార్యక్రమానికి మిషన్ కాకతీయ అని పేరు పెట్టుకొన్నామన్నారు. 

తెలంగాణలో మేలైన పత్తి పండుతోందన్నారు. తెలంగాణ ఏర్పడిన రోజున రాష్ట్రంలో 60 జిన్నింగ్ మిల్లులుంటే ఇవాళ 400కిపైగా జిన్నింగ్ మిల్లులున్నాయన్నారు. తమది రైతులకు మేలు చేసే ప్రభుత్వమని ఆయన చెప్పారు. రైతు మంచిగుంటే ఊరు సల్లగుంటదన్నారు. రైతులతో ఎంతోమందికి పని దొరుకుతుందన్నారు సీఎం. అవినీతిని అరికట్టేందుకే రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని సీఎం తెలిపారు.. అన్నీ ఆలోచించే రైతులకు రైతు బంధు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టుగా కేసీఆర్ తెలిపారు. రైతు రాజ్యం అంటే ఇదేనని తెలిపారు. ధరణి కోసం మూడేళ్ల కోసం శ్రమించినట్టుగా సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అందుకే విపక్షాలు విమర్శలు చేసినా కూడ పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
 


 


 

click me!