
హైదరాబాద్ రోడ్లను, రవాణా వ్యవస్థ మెరుగుపర్చడంతో పాటు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోనున్నట్లుమున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ రోజు ఆయన మున్సిపల్ అధికారులతో హైదరాబాద్ రోడ్లపై సమీక్ష నిర్వహించారు. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులను రూ.75 కోట్లతో 489 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 176 రహదారుల నిర్మాణ పనులు పూర్తయినట్లు కేటీఆర్ తెలిపారు.
గ్రేటర్ పరిధిలో 480 కిలోమీటర్ల విస్తీర్ణంలో వైట్ ట్యాపింగ్ రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. 1275 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే వైట్ ట్యాపింగ్ రోడ్లను మొదటి దశలో రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రారంభించాలని సూచించారు. వచ్చే వర్షాకాలం లోగా కనీసం వైట్ ట్యాపింగ్ రహదారుల క్యారేజి, మార్గాల నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.