కెటిఆర్ ను రేవంత్ ముగ్గులోకి దింపేది అందుకేనా?

First Published Jul 26, 2017, 1:29 PM IST
Highlights
  • నాయిని వర్సెస్ రేవంత్ మధ్యలో కెటిఆర్
  • నాయినిని వదిలి కెటిఆర్ ను విమర్శించిన రేవంత్
  • రక్త నమూనాలకు సిధ్దమని రేవంత్ ప్రకటన
  • కెటిఆర్ ను ఒప్పించాలంటూ నాయినికి సవాల్

రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతాయో? ఎవరు ఎవరిని విమర్శిస్తారో? ఎవరు ఎవరిని ఎందుకు విమర్శిస్తారో? ఎవరూ చెప్పలేరు. అదే రాజకీయాల్లో ఉండే అసలు మజా అంటారు. అందుకే రాజకీయాలెప్పుడూ డైనమిక్ గా, గమ్మత్తుగా ఉంటాయి. తాజాగా నాయిని నర్సింహ్మారెడ్డి, రేవంత్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ పోరాటం అటుపోయి ఇటుపోయి మంత్రి కెటిఆర్ మీదకు మళ్లింది. వ్యూహాత్మకంగా మంత్రి కెటిఆర్ ను ముగ్గులోకి గుంజేందుకు రేవంత్ ప్రయత్నించారు.

టిడిపి వర్కింగ్ ప్రసిడంట్ రేవంత్ రెడ్డి, బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు లకు పబ్ కు వెళ్లే అలవాటుందని, అందుకే వాళ్లు డ్రగ్స్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయాల్లో దుమారం రేపింది. దీనిపై బిజెపి అధికార ప్రతినిధి అంతే ఘాటుగా స్పందించారు. తనకు లిక్కర్ తాగే అలవాటే లేదని చెప్పారు. పబ్ కు వెళ్లే అలవాటు అసలే లేదన్నారు.  అసలు ప్లేబాయ్ పబ్ ను ప్రారంభించిందే మంత్రి కెటిఆర్ అనే విషయం నాయిని తెలుసుకోవాలని రఘునందన్ సూచించారు.

ఇక రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా మాట్లాడారు. నాయిని నర్సింహ్మారెడ్డి మీసాల మీద ఒట్టేసి చెబుతున్నా... నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మందు తాగలేదు. తాగినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. అన్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ... నాయినికి దమ్ముంటే తన శాంపుల్స్ తోపాటూ మంత్రి కెటిఆర్ శాంపుల్స్ కూడా ఇద్దాం. ఇటువైపు నేను రెడీ అటువైపు వారిని ఒప్పించే బాధ్యత నాయిని తీసుకుంటారా అని సవాల్ చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో నాయిని నర్సింహ్మారెడ్డి విలక్షణమైన నేత. ఆయన మాట, మనిషి ఆహర్యం గంభీరంగా ఉంటాయి కానీ చాలా విషయాల్లో దాపరికం లేకుండా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతూ బోలా మనిషిగా పేరుతెచ్చుకున్నారు. కానీ ఆయన సోషలిస్టు. ట్రేడ్ యూనియన్లలో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయను మద్యం సేవించే అలవాటు లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా లిక్కర్ తాగే అలవాటు ఆయనకు రాలేదు.

నాయినికి మందు తాగే అలవాటు లేదు కాబట్టి రేవంత్ రెడ్డి తన సవాళ్లు నాయిని మీద కాకుండా కేటిఆర్ వైపుకు మళ్లించాడు. కెటిఆర్ ను శాంపుల్స్ ఇచ్చేందుకు తీసుకురా దమ్ముంటూ అంటూ నాయినికి సవాల్ విసిరారు. మరి కెటిఆర్ ను శాంపుల్స్ సేకరణకు ఒప్పించే ధైర్యం నాయిని చేయగలడా? ఇది ఆచరణలో సాధ్యమయ్యే పనేనా? కానీ రేవంత్ మాత్రం సూటిగా నాయినిని టార్గెట్ చేయకుండా రూటు మార్చి కెటిఆర్, కెసిఆర్ ను టార్గెట్ చేశారు. నాయిని భుజాలపై తుపాకి పెట్టి కెటిఆర్ ను కాల్చే ప్రయత్నం చేశాడు రేవంత్ అని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

click me!