కేసీఆర్ పెట్టే బువ్వ కోసం నేను పోదలచుకోలేదు : రేవంత్

First Published Oct 26, 2017, 3:07 PM IST
Highlights
  • నన్ను పదవి నుంచి తప్పించాలన్న బాధ కేసిఆర్ కు తప్ప ఎవరికి లేదు
  • స్టార్ హోటళ్లలో ప్రజా సమస్యలపై చర్చిస్తరా?
  • ఎల్పీ ఆఫీసులు ఉంచుకొని స్టార్ హోటళ్లెందుకు?
  • బాబు లేనప్పుడే నామీద యాక్షన్ తీసుకుంటరా?
  • నేను ఇప్పుడు సామాన్య కార్యకర్తను మాత్రమే

టిడిపి నేత రేవంత్ రెడ్డి మరోసారి సంచలన విషయాలు వెల్లడించారు. గోల్కొండ హోటల్ లో జరిగే టిడిపి, బిజెపి మీటింగ్ కేసిఆర్ డైరెక్షన్ లో జరుగుతుందని ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనేక అంశాలపై రేవంత్ వివరణ ఇచ్చారు. ఆయన మాటల్లోనే చదవండి.

నాపై పార్టీ నేతలు విమర్శలు చేస్తుంటే ఆపాల్సిన బాధ్యత రమణ పై లేదా? ఉదయం పార్టీ ఆఫీసులో, రాత్రికి కేసీఆర్ వద్దకు వెళ్లేవాళ్లకు నేను సమాధానం చెప్పను. నా పోరాటమే కేసీఆర్ పైన.. అసోంటప్పుడు నన్ను తిట్టేవారెవరైనా కేసీఆర్ అనుకూలురే.

రెండు రోజులు పదవిలో ఉంటే నేనేమైనా ఆస్తులు కూడబెట్టుకుంటానా? చంద్రబాబు దేశంలో లేనప్పుడు నా పదవులు తొలగిస్తారా? ప్రజా సమస్యల పై స్టార్ హోటళ్లలో చర్చించేదేమిటి? ఎల్పీ కార్యాలయాలు ఉండగా హోటళ్లలో సమావేశాలు ఎందుకు? గోల్కొండ సమావేశం కేసీఆర్ పెట్టించారేమో మరి.. నాకైతే తెలియదు.

నన్ను జైలుకు పంపిన వాడికి అనుకూలంగా మా పార్టీ నేతలే మాట్లాడితే ఎలా? నన్ను పదవుల నుంచి తొలగించాల్సిన అవసరం కేసీఆర్ కు తప్ప మరెవరికీ లేదు. ఆయన ఆలోచనకు దగ్గట్టు నా పదవులు తొలగించారు. మాతో కలిసే సమస్యే లేదని అమిత్ షా నుంచి లక్ష్మణ్ వరకు చెప్పారు. తెలంగాణలో టీడీపీ లేదని బీజేపీ అధికార ప్రతినిధి మురళీధరరావే అన్నారు. అలాంటి బీజేపీతో అకస్మాత్తుగా కలయిక ఎలా జరిగింది?

అకస్మాత్తుగా టిడిపి, బిజెపి పార్టీలను కలిపిన అదృశ్య శక్తి ఎవరు? ఓటుకు నోటుతోనే పార్టీనాశనమైందని ఒకడంటాడు. కుంతియా ఏదో అన్నాడని నన్ను వివరణ కోరుతున్నారు. రేవంత్ తప్ప రమణతో సహా అందరూ మావైపే ఉన్నారని ఎర్రబెల్లి అన్నారు. అలాంటప్పుడు దానిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదా? పార్టీ కేడర్ ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి?

స్టార్ హోటళ్లలో ప్రజా సమస్యల పై చర్చించరు...హోటళ్లలో రహస్య సమావేశాలు పెట్టుకుంటారు. ఈ పరిణామాలపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తా. మేం ప్రాణాలు పెట్టి పోరాడుతున్నాం. కార్యకర్తలు కేసుల్లో చిక్కి ఏడుస్తున్నారు. మా కార్యకర్తలను వేధిస్తోన్న టీఆర్ఎస్ మిత్రుడో..శత్రువో తేల్చుకోలేకపోతే ఎలా? 30 ఏళ్ల నుంచి కేసీఆర్ మంచి మిత్రుడని ఒకాయన అంటాడు.

ఉత్తమ్ తో నేను, రమణ కలిసే చర్చలు జరిపాం. నేరెళ్ల ఘటన పై ఢిల్లీకి కాంగ్రెస్ వాళ్లతో రమణ వెళ్లలేదా? నాయకుడు వచ్చే వరకు ఆగే ఓపిక లేదా? చంద్రబాబు ఏ విషయంలోనైనా మాట్లాడాల్సి వస్తే అందరికీ టెలీ కాన్ఫరెన్స్ పెడతారు. నాపై రమణ నివేదిక ఎవరినడిగి పంపారు? దానిపై కేంద్ర కమిటీ సభ్యుల సంతకాలు ఉన్నాయా? ఇప్పుడు నేను పార్టీలో సామాన్య కార్యకర్తను.

పాలేరు, సింగరేణిలో కాంగ్రెస్ తో కలిసే పని చేశాం. రాష్ట్రానికి గులాబీ చీడ పట్టింది. దాన్ని వదిలించడానికి రకరకాల మందులు కొడతాం. చంద్రబాబు నాపై విశ్వాసంతో పదవులు ఇచ్చారు. ఆయన లేనప్పుడు నిర్ణయాలు చేస్తే దుర్మార్గం అవుతుంది. పదవుల నుంచి తీసేసినట్టు బాబు నాకు చెప్పలేదు. ఇలా అనేక అంశాలపై రేవంత్ వివరణ ఇచ్చారు అసెంబ్లీలో.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బేగంపేటలో ఈ మహిళ ఎలా రెచ్చిపోయి కారు నడిపిందో చూడండి (వీడియో)

https://goo.gl/CcQSvc

click me!