
తెలంగాణ సిఎం కేసిఆర్ కు టిడిపి శాసనసభా పక్ష నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. హోంగార్డుల సమస్యలపై రేవంత్ తన లేఖలో వివరించారు. ఆ లేఖను ఉన్నది ఉన్నట్లు ప్రచురిస్తున్నాం....
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారికి…
“పరాయిపాలకుల పాలనలో ఆగమైపోయిన తమ బతుకులు తెలంగాణ రాష్ట్రంలోనైన బాగుపడతాయని ఎన్నో ఆశలుపెట్టుకున్న హోంగార్డులతో మీ ప్రభుత్వం చెలగాటాలు ఆడుతోంది. మీరు అధికారంలోకి వస్తే వారి సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని నమ్మి ఆశగా ఎదురు చూస్తున్న వారికి ఎప్పటికప్పుడు మాటలు చెప్పి మభ్యపెట్టడమే తప్ప న్యాయం చేసే దిశగా మీ ప్రభుత్వంఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వారి న్యాయమైన కోర్కెల సాధన కోసం ఆందోళనకు దిగినా మీరు సహించడంలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చేకొద్దిపాటి వేతనాలతో బతకలేక భవిష్యత్తుపై ఆశ లేక హోంగార్డులు నిరాశ నిష్పుహలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీని ఫలితంగానే బతకడం కంటే చావడం మేలన్న ఆలోచన వారిలో వస్తోంది.”కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన హోంగార్డు జంగం శివకుమార్ సోమవారం ఆత్మహత్యకు పాల్పడడం దారుణమైన విషయం. చాలీచాలని వేతనాలతో “రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ హోంగార్డు కూడ ఆనందంగా లేడని సిఎం ఇచ్చిన హామీ నెరవెరకపోవడంతో ఇక తమ బతుకులు బాగుపడవన్న మనస్థాపంతో ఊరివేసుకొని చనిపోతున్నానని..” శివకుమార్ తన సూసైడ్ నోట్ లో రాసిన మాటలు మానవత్వం ఉన్నవారిని ఎవరినైన కదిలిస్తాయి. అయితే మీ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? లేదా? అన్నది తేల్చాల్సిందే మీరే. వాస్తవానికి శివకుమార్ ది ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వం చేసిన హత్య. మీరు స్వయంగా ఇచ్చిన హామీని నెరవేర్చని కారణంగా జరిగిన దారుణం.
తెలంగాణ ఉద్యమ సమయంలో మీ పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలో మీరు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లేదా ఇతర పేర్లతో ఉద్యోగులను దోచుకోవడాన్ని వ్యతిరేకిస్తామని, వారందరినీ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరాపార్కు వద్ద అప్పట్లో జరిగిన హోంగార్డుల ధర్నాలోనూ, కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళనలలోనూ పాల్గొని మీరే స్వయంగా ఈ విషయాన్నిప్రకటించడం జరిగిందని మీకు గుర్తు చేస్తున్నాను. హోంగార్డులను గురించి అప్పట్లో మీరు “ మీ బతుకులు ఆంధ్ర పాలకుల చేతుల్లో ఆగమైపోయాయి.. మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తాము.. పోలీసులుగా ప్రమోషన్లు ఇస్తాము.. పోలీసులకు కల్పించే అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తాము..” అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 19,600 మంది హోంగార్డులు అప్పుడు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని మాత్రమే ఇది వరకు ఆందోళన చేశారు. కానీ మీ ప్రభుత్వం వారి ఆందోళనను నిర్ధాక్షిణ్యంగా అణచివేసింది. మీరు చెప్పింది చేయమని అడగడం కూడా వారి తప్పేనా? 20 సంవత్సరాలకు పైబడి అనుభవం ఉన్న హోంగార్డులకు ఇప్పటి వరకు మీరు చెల్లిస్తున్న వేతనం కేవలం రూ. 12 వేలు మాత్రమే. ఈ వేతనంతో బతకడం ఎలా సాధ్యమవుతుందో మీరే చెప్పాలి.
ట్రాఫిక్ పోలీసులతోపాటు హోంగార్డులు కూడా దుమ్మూ, దూళిలో నిలబడినడి రోడ్డుపై రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు. ఈ కారణంగా వారు అనారోగ్యనికి గురయ్యే ప్రమాదం ఉంటుందన్న ఉద్దేశ్యంతో ట్రాఫిక్లో పనిచేసే కానిస్టేబుళ్లకు 30 శాతం అదనపు వేతనాన్ని చెల్లిస్తున్నప్రభుత్వం అదే పనిని అంతకంటే ఎక్కువ సేపు చేస్తున్నా హోంగార్డులకు ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించడం లేదు. కనీసం వారాంతపు సెలవులు కూడ లేకుండా అసలు సిసలు బానిసల్లా పనిచేస్తున్న హోంగార్డులకు ఉద్యోగ భద్రత లేని కారణంగావారు సాటి పోలీసుల నుంచి కూడ అవమానాలను ఎదుర్కొంటున్నారు. పెద్ద పోలీసు ఉద్యోగుల ఇళ్లల్లో పనివారి కంటే హీనంగా పొద్దస్తమానం పనిచేస్తున్నారు. తమ భార్య, బిడ్డల భారాన్ని దేవుడిపై వేసి నడిరోడ్డుల్లో నిలబడి ట్రాఫిక్ డ్యూటీని నిర్వహిస్తున్నారు. ఈ రోజు హోంగార్డులు లేకుండా మన హైదరాబాద్ నగరంలో ఒక్క రోజు కూడా ట్రాఫిక్ ను నియంత్రించే సామర్థ్యం పోలీసు శాఖకు ఎంతమాత్రం లేదని చెప్పడానికి సందేహించాల్సిన అవసరమే లేదు. గతంలో భారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ నగరంలో నడిరోడ్లపై నిలబడీ ప్రజలకు చేయూతనందించిన నిజమైన హీరోలు హోంగార్డులు. హోంగార్డుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం సమ్మతించాల్సింది పోయి ఉద్యమించిన సమయంలో వారిపై పోలీసులతో దమనకాండను సాగించటం, బూటు కాళ్లతో తొక్కించి లాఠీలతో చితకబాదడం, మహిళలని కూడ చూడకుండా వెంటపడి తరిమికొట్టడం జరిగింది. ఇది చాలక ఆందోళన చేసిన హోంగార్డులను ఆందోళన విరమించక పోతే చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర డీజీపీ బెదిరించడం కూడ జరిగింది.
ఏళ్ల తరబడిగా వెట్టి చాకిరిలో పనిచేస్తున్నవారికి ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేస్తుందా? లేదా? అని తెలంగాణ సమాజం మొత్తం ఈ రోజున మీవైపే చూస్తోంది. ఇక్కడ మరో విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరమున్నది. హోంగార్డులందరినీ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి పోలీసులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని 2003లోనే సుప్రీం కోర్టు ఆదేశలను జారీ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఉత్తర్వులను కూడ మీకు పంపిస్తున్నాం. దీని ఆధారంగానే అండమాన్ నికోబార్ లో పనిచేస్తున్నహోంగార్డులందరినీ సర్వీసులను క్రమబద్దీకరించడంతోపాటు వారికిబేసిక్ పే, గ్రేడ్ పే, డీఏ, యూనిఫాం అలవెన్స్, ఇంటీరియంఅలవెన్స్, ట్రాన్స్ పోర్టు అలవెన్స్, వాషింగ్ అలవెన్స్ తదితరాలకు సంబంధించి రూ. 12.44 కోట్లను కూడ చెల్లించడం జరిగింది. దీనికిసంబంధించి 2013 మార్చి 5 న లోక్ సభలో అడిగిన ప్రశ్నకుప్రభుత్వం ఇచ్చిన జవాబును కూడ ఈ లేఖతోఈపాటుగాజతపరుస్తున్నాం. ఈ ఉత్తర్వులు ఆంధ్రా పాలకుల కాలంలో వచ్చినవని మీరు అనుకున్నట్లయితే తాజాగా సుప్రీం కోర్టు కూడ సమనమైన పనికిసమాన వేతనాన్ని చెల్లించి తీరాలని స్పష్టంగా ఆదేశాలను జారీచేసిందనే విషయాన్ని కూడ మీరు గమనించాల్సి ఉంది. దీనిప్రకారంగా పోలీసులతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డులకువారితో సమానమైన జీతభత్యాలను, సౌకర్యాలను కల్పించాల్సిఉంటుంది. మీకు అత్యున్నత న్యాయస్థానంపై ఏమాత్రం గౌరవం ఉన్నా తక్షణం హోంగార్డుల సర్వీసులను క్రమబద్దీకరించండి. కనీసం మీరు ఇచ్చిన మాటకు మీరైనా గౌరవించండి.
హోంగార్డుల తరపున మా డిమాండ్లు:-
• హోంగార్డు శివకుమార్ కుటుంబానికి తక్షణం రూ. 20 లక్షలఆర్థిక సహాయాన్ని అందించాలి.
• శివకుమార్ కుటుంబంలో ఒకరికీ ప్రభుత్వ ఉద్యోగంతోపాటుడబుల్ బెడ్ రూం ఇంటిని కేటాయించాలి.
• హోంగార్డుల సర్వీసులను క్రమబద్దీకరించే ప్రక్రియను తక్షణంచేపట్టాలి.
• పోలీసులతో సమానంగా ఆరోగ్య భద్రత, వైద్య సౌకర్యంకల్పించాలి.
• పోలీసులతో సమానంగా వేతనాన్ని, అలవెన్స్ లను చెల్లించాలి.
• ట్రాఫిక్ విధులను నిర్వహించే హోంగార్డులకు కూడ 30% అదనపు వేతనాన్ని చెల్లించాలి.
• హోంగార్డులకు తప్పనిసరిగా వారాంతపు సెలవులు ఇవ్వాలి.
• ప్రమోషన్లలో పోలీసులతో సమాన అవకాశాలు కల్పించాలి.
ఈ విషయంగా ఇప్పటికైనా మీరు స్పందించని పక్షంలో శివకుమార్ తరహాలోనే మరికొందరు హోంగార్డులు కూడ ఇక తమ బతుకులు మారవని నిరాశనిష్పుహలకు గురై అఘాయిత్యాలకు పాల్పడితే అందుకు మీరే బాధ్యులు అవుతారని హెచ్చరిస్తున్నాము. మీరుతక్షణం కల్పించుకొని హోంగార్డులకు న్యాయం చేస్తారని, చేయాలని ఆశిస్తున్నాము. అలాకాని పక్షంలో వారికి మద్దతుగా తెలుగుదేశంపార్టీ తరుపున మేము కూడ రంగంలోకి దిగి హోంగార్డులతోఆందోళన చేయకతప్పదనీ తెలియజేస్తున్నాము.
(ఎ.రేవంత్ రెడ్డి)
ఫ్లోర్ లీడర్, టిడిఎల్పీ
.......................................................
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి