‘బతుకమ్మ’ కే షాక్ ఇచ్చిన నల్లగొండ పల్లెటూరు

First Published Sep 19, 2017, 2:52 PM IST
Highlights
  • బతుకమ్మ చీరల పంపిణీని బహిష్కరించిన గ్రామస్తులు
  • పంపిణీ కేంద్రానికి తాళం వేసి రెండు రోజులుగా నిరసన
  • చీరలొద్దు కానీ రోడ్డు కావాలని గ్రామస్తుల డిమాండ్
  • రోడ్డు కోసం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఆలకించని పెద్ద మనుుషులు

అది నల్లగొండ జిల్లాలోని మారుమూల పల్లెటూరు. నల్లగొండకు 26 కిలోమీటర్ల దూరంలో విసిరేసినట్లు ఉండే గ్రామం. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యంలేదు. రోడ్డు వేయించాలంటూ ఆ గ్రామస్తులు నేతలందరినీ వేడుకున్నారు. ఎంపి, ఎమ్మెల్యే, మంత్రి ఇలా ఎవరిని అడిగినా వేయిస్తం వేయిస్తం అంటున్నారు తప్ప రోడ్డు వేయిస్తలేరు. దీంతో వారు తెలంగాణ సర్కారు ప్రాణప్రదంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికే షాక్ ఇచ్చారు. ఆ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవండి, చూడండి.

 

నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో దుబ్బకాల్వ అనే గ్రామం ఉంది. ఈ దుబ్బ కాల్వ గ్రామం కొరటికల్ అనే గ్రామానికి హామ్లెట్ విలేజ్. అయితే ఈ ఊరికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. గ్రామ జనాభా సుమారు 500 ఉంటుంది. కింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకు నాలుగు కిలోమీటర్ల పొడవు రోడ్డు వేయించమని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా వారిని పట్టించుకున్న నాథుడే కరువైండు.

 వానాకాలం వస్తే ఈ ఊరి కష్టాలు మరింత భయాననకం. ఎందుకంటే ఈ ఊరికి రెండు వైపులా మునుగోడు వాగు, కొరటికల్ వాగు అనేవి రెండు వాగులున్నాయి. వానాకాలంలో ఆ వాగులు పొంగిపొర్లితే ఊరిలోకి రావాలన్నా, ఊరి నుంచి బయటకు వెళ్లాలన్నా కష్టకాలమే.  ఉన్నమునుగోడు వాగు, కొరటికల్ వాగు ఊరికి రెండు వైపులా వస్తాయి. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ నాయకులు వచ్చి మీ ఊరికి రోడ్డేపిస్తం అని చెబుతున్నారు తప్ప ఎన్నికలైన తర్వాత మరచిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గ్రామానికి రోడ్డు సాధించేందుకు వాళ్లు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయారు. ఎలాగైనా రోడ్డు సాధించేందుకు వారు తాజాగా ఒక కొత్త ఎత్తుగడ ఎంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరలను గ్రామస్తులంతా మూకుమ్మడిగా నిర్ణయించుకుని బహిష్కరించారు. గ్రామానికి రోడ్డు కావాలి తప్ప బతుకమ్మ చీరలతో మాకు ఒరిగేదేం లేదని వారు నినదించారు. బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమై రెండు రోజులవుతున్నా ఆ గ్రామంలో ఒక్క చీర కూడా పంపిణీ జరగలేదు. గ్రామ మహిళల కోసం చీరల పంపిణీ చేపట్టే ఆఫీసుకు తాళాలేసి గ్రామస్తులంతా నిరసన తెలుపుతున్నారు. ఉన్నతాధికారులు, ఎంపి, ఎమ్మెల్యే వచ్చే వరకు చీరల పంపిణీ జరగనిచ్చేది లేదని గ్రామస్తులు శపదం చేస్తున్నారు.

బంగారు తెలంగాణలో బ్రహ్మాండ్లమైన రోడ్లు వేయిస్తున్నామంటూ మాటలు చెబుతున్న తెలంగాణ సర్కారు ఈ చిన్న పల్లెటూరు జనాల బాధలను పట్టించుకోవాలి. కేవలం 4 కిలోమీటర్ల రోడ్లను మండల కేంద్రం అయిన మునుగోడు నుంచి వేయించాలన్న వారి కోరికను తీర్చాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

click me!