ఆమాట చెప్పడానికి నామోషీ ఎందుకు రేవంత్ ?

First Published Oct 31, 2017, 5:51 PM IST
Highlights
  • రేవంత్ ఎపిసోడ్ టీ కప్ లో తుపాను లాంటిదే
  • రేవంత్ ఎందుకు పోయిండో అందరికీ తెలుసు
  • ఆ విషయంలో నామోషీ పడుతున్నడు
  • కొడంగల్ లో టిఆర్ఎస్ దే గెలుపు

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఘటనపై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. రేవంత్ విషయంలో జరుగుతున్న ప్రచారం టీ కప్ లో తుఫాన్ లాంటిదేనని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను రేవంత్ కు సంధించారు జూపల్లి. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.

సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తి రేవంత్... ఇప్పుడు ఆయన అదే పార్టీ లో చేరాడు. 60 సంవత్సరాల లో ఎవరూ చేయని పనులు... నూతన ఒరవడితో... పూర్తి పారదర్శకంగా మా ప్రభుత్వం చేసింది. కేసీఆర్ కబంధ హస్తాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉందంటూ... అన్ని పార్టీలు ఏకం కావాలి అని రేవంత్ అంటున్నాడు. మరి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సీమాంధ్రుల కబంధ హస్తాల్లోనే ఉంది కదా? అప్పుడు ఎందుకు తెలంగాణ కోసం మాట్లాడలేదు? ముందుకు రాలేదు?

ఎన్టీఆర్ అందించిన పౌరుషం అని రేవంత్ అన్నాడు. మరి అలాంటి పౌరుషం ఉంటే... ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ముందుకు రాలేదు? ఎన్టీఆర్ పౌరుషం నిజంగా అందిపుచ్చుకుని ఉంటే... తెలంగాణ ప్రజలు ఆత్మబలిదానాలు చేసుకునేటప్పుడు ఎందుకు వాటిని ఆపలేదు? తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అన్నది వాస్తవమే.. అయినా ప్రజలు తెరాస నే గెలిపించారు కదా? గొంతు చించుకొని అరిస్తే కాదు... అందులో వాస్తవాన్ని చూస్తారు ప్రజలు.

తెలంగాణ లో ఉప ఎన్నికల తర్వాత టిడిపి కనుమరుగయ్యింది... కాంగ్రెస్ కూడా అంతే. అచ్చంపేట మున్సిపల్ ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా... గెలవలేదు కదా? ఉనికిని నిలబెట్టుకునే ఆలోచనతోనే... కాంగ్రెస్ లోకి రేవంత్ వెళ్ళాడు. కాకపోతే అది చెప్పుకోవడంలో రేవంత్ నామోషి గా ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు శిక్షణలో పెరిగిన అని రేవంత్ అంటున్నాడు. దీని ఆంతర్యం ఏంటి?

తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యింది... తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తోనే కాంగ్రెస్ లో చేరాడని అర్థమవుతుంది కదా? టీడీపీ, కాంగ్రెస్ లు కుయుక్తులు పన్నుతున్నాయి. కేసీఆర్ ఈ మూడేళ్లలో ఏమీ చేయకపోతే... జరిగిన అన్ని ఎలక్షన్స్ లో ఎలా గెలవగలిగారు? ప్రజల అభివృద్ధి అన్నదే ధ్యేయం గా కార్యక్రమాలు చేస్తున్నాం. ఉనికి కోసం వాస్తవాలను మభ్యపెట్టి ఇలా మాట్లాడుతున్నారు. గత్యంతరం లేకనే... కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. మీరు సంధించే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.

నీ బాబునే(చంద్రబాబు) మట్టికరిపించిన ఘనత మా కేసీఆర్ ది. కొడంగల్, నారాయణపేట లో ప్రజల బాధలను గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు? ఉప ఎన్నికల్లో ఎలాంటి result పునరావృతం అయిందో... మళ్ళీ ఎక్కడ ఎన్నిక జరిగినా... అదే రిజల్ట్ వస్తుంది. అధికారం, పదవులు అన్న కోణంలోనే మీరు రాజకీయాలు చేస్తారు తప్ప... ప్రజల సమస్యలు అన్న కోణంలో చేయరు.

ఇప్పటి వరకు టీడీపీ కి ఏ గతి పట్టిందో... త్వరలో కాంగ్రెస్ కి అదే పడుతుంది. రేవంత్ రెడ్డి అసలు రంగు ఏంటో తెలియాలి. కొడంగల్ ఉప ఎన్నిక వస్తే... ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం వచ్చిందో.. అదే వస్తుంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/AmUiXz

click me!