ఓయు భూముల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు

First Published Oct 31, 2017, 1:45 PM IST
Highlights
  • ఉస్మానియా యూనివర్శిటీ భూములను రక్షిస్తాం.
  • 24 ఎకరాల్లో గుడిసెలు వేసుకున పేదలకు డబుల్ బెడ్రూములు
  • తద్వారా ఉస్మానియా భూములు రక్షిస్తాం

ఉస్మానియా యూనివర్శిటీలోని భూముల్లో 24 ఎకరాలలో పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వారందరికీ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించే ఆలోచన ఉంది. తద్వారా ఉస్మానియా యూనివర్శిటీ భూములను రక్షించే ప్రయత్నం చేస్తామని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ విషయాన్ని శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

విశ్వవిద్యాలయాల భూములు కాపాడడానికి టీ ఆర్ ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములు ఇతర సంస్థలకు ఇవ్వడంపై మండలి సభ్యులు ఎం.ఎస్ ప్రభాకర్, రామచంద్రరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి అడిగిన అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సవివరమైన సమాధానం ఇచ్చారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 1627 ఎకరాల భూమి ఉంటే...ఇందులో 187.512 ఎకరాల భూమిని 24 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు గత ప్రభుత్వ హయాంలోనే లీజ్ కు ఇచ్చారు. ఈ లీజ్ గడువు ముగిసిన నాలుగు సంస్థలు ట్రాన్స్ కో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్-సీవరేజ్ బోర్డ్, సెస్ సంస్థలు మళ్లీ లీజ్ ను పునరుద్ధరించాలని ప్రభుత్వం వద్దకు వచ్చాయి. అయితే లీజ్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీ. ఓ 571 ప్రకారం లీజ్ రేట్లను పెంచి రెన్యువల్ చేయడం జరిగింది.

లీజ్ రెన్యువల్ చేసిన వాటిలో ట్రాన్స్ కో కు 59 లక్షల రూపాయలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు లక్ష రూపాయలు , సెస్ కు 50వేల రూపాయలు, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ కు ఎకరానికి 10వేల రూపాయల చొప్పున లీజ్ కు ఇవ్వడం జరిగింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని 1627 ఎకరాల్లో 255.8 ఎకరాలను వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలకు లీజ్ కోసం, అక్కడి నిరుపేదల ఇళ్ల నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. 56 ఎకరాలు ఆక్రమణకు గురి అవుతున్న అంశం సుప్రీం కోర్టులో ఉంది. అయితే ఈ 56 ఎకరాలు ప్రస్తుతం పూర్తిగా కాంపౌండ్ వాల్ పరిధిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధీనంలోనే ఉంది. 24 ఎకరాల భూమిలో ఉస్మానియా లోని నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి ఆ భూమిని పరిరక్షించే చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

లీజ్ గడువు పూర్తికాని సంస్థల లీజ్ ధరలను కూడా పెంచాలన్న గౌరవ సభ్యుల ప్రతిపాదనను ప్రభుత్వం న్యాయ సలహా తీసుకొని పెంచే అంశాన్ని పరిశీలిస్తుంది" అని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి శాసన మండలిలో సమాధానం ఇచ్చారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/AmUiXz

click me!