రేవంత్ రెడ్డికి గోపనపల్లి భూముల ఉచ్చు బిగిస్తోంది. తప్పుడు పత్రాలతో రేవంత్ రెడ్డి ఆయన సోదరుడు భూములు కొనుగోోలు చేశారని కొందరు కోర్టును ఆశ్రయించారు.ఈ విషయంలో రెవిన్యూ అధికారి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అతడి సోదరుడితో కలిసి తప్పుడు డాక్యుమెంట్లతో అత్యంత ఖరీదైన భూమిని తన పేరున మ్యుటేషన్ చేయించుకొన్నట్టుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపారు. ఈ విషయంలో అక్రమాలకు పాల్పడిన రెవిన్యూ అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ని సస్పెండ్ చేసింది ప్రభుత్వం.
హైద్రాబాద్ గోపనపల్లి సర్వే నెంబర్ 127లో గల 10.21 ఎకరాల భూమికి సంబంధించి తప్పుడు పత్రాలతో విక్రయాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై కొందరు కోర్టును కూడ ఆశ్రయించారు. ఈ విషయమై ప్రభుత్వం విచారించింది.
undefined
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 127లో 10.21 ఎకరాల భూమి ఉంది. 1977 వరకు ఈ భూమి వడ్డె హనుమ, అతని వారసుడు వడ్డె మల్లయ్య పేరు మీద ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంది. కానీ, 1978 నుంచి ఈ భూమి మల్లయ్య పేరు మీద పహాణీలో నమోదవుతూ వస్తున్నది. మల్లయ్య పేరు ఉంది కానీ, ఆయన ఇంటి పేరు లేదు.
1993-94 నుంచి ఈ భూమికి పట్టాదారుగా దబ్బ మల్లయ్య అని రెవెన్యూ రికార్డుల్లో ఎంటర్ అవుతూ వస్తున్నది. దబ్బ మల్లయ్య పేరును ఎంటర్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, 2001-02 నుంచి పహాణీల్లో మల్లయ్య పేరును తొలగించారు.
2005లో అప్పటి శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్/తహసిల్దార్ ఇ.మల్లయ్యకు వారసుడిగా చెప్పుకునే ఇ.లక్ష్మయ్య పేరు మీద 2 ఎకరాల 21 గుంటల భూమిని రాశారు.. ఆ భూమి లక్ష్మయ్య కాస్తులో ఉన్నట్లు తేల్చేశారు. అదే తహసిల్దార్ మళ్ళీ ఈ వివరాలను సవరిస్తూ లక్ష్మయ్య కేవలం 31 ½ గుంటల్లో ఉన్నట్టు రికార్డులు నమోదయ్యాయి.
ఎలాంటి ఆధారం లేకుండానే లక్ష్మయ్య పేరు మీద మొదట 2 ఎకరాల 21 ఎకరాలను రాయడం, మళ్లీ సవరించి 31 ½ గుంటలకు మార్చడం రెండూ కూడా తహసిల్దార్ తన అధికార పరిధిని అతిక్రమించారని రెవిన్యూ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇలా అక్రమంగా లక్ష్మయ్య పేరు మీద రికార్డుల్లో ఎంటర్ అయిన 31 ½ గుంటల భూమిని అనుముల రేవంత్ రెడ్డి కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్ రాసుకొన్నారు.. ఇ. లక్ష్మయ్యకు ఎలాంటి పట్టదారు హక్కులు లేనప్పటికీ అతని నుంచి భూమిని కొనుగోలు చేసినట్లు చేసుకున్న సేల్ డీడ్ ఆధారంగా రేవంత్ రెడ్డి కి అనుకూలంగా తహసిల్దార్ వ్యవహరించారని రెవిన్యూ ఉన్నతాదికారులు తేల్చేశారు.
రేవంత్ రెడ్డి పేరును ఈ భూమికి హక్కు దారుడిగా పేర్కొంటూ 2005లో అప్పటి తహసిల్దార్ రికార్డుల్లో ఎంటర్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేకుండానే ఇ.లక్ష్మయ్య ఒక ఎకరం 29 గుంటల భూమిని రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి అమ్మాడు. అధికారులు ఆ కొనుగోలు ప్రకారం కొండల్ రెడ్డి పేరిట 2015లో మ్యుటేషన్ చేశారు.
మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకున్నప్పటికీ తన పేరు మీద ఉన్న డాక్యుమెంట్ల ద్వారా డి.మల్లయ్య అనే వ్యక్తి 2 ఎకరాల 20 గుంటల భూమిని కళావతి అనే వ్యక్తికి అమ్మాడు. ఈ భూమిని కూడా అధికారులు కళావతి పేరు మీద మార్పిడి (మ్యుటేషన్) చేశారు. ఆ తర్వాత ఆ భూమిని కళావతి అనే వ్యక్తి ఎ. కొండల్ రెడ్డి పేరు మీదికి బదిలీ చేశారు.
ఇంకోవైపు 1989లో ఎ. వెంకటరెడ్డి అనే వ్యక్తి దబ్బ మల్లయ్య నుంచి ఒక ఎకరం పదున్నర గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే 1989లో దబ్బ మల్లయ్య పేరు మీద భూమి ఉన్నట్లు రికార్డుల్లో లేదని రెవిన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు.
also read:రేవంత్ రెడ్డి కోసం రికార్డుల తారుమారు: డిప్యూటీ కలెక్టర్ సస్పెన్షన్
వెంకటరావు ఈ భూమిలోని 13 గుంటల భూమిని తర్వాత ఎ. కొండల్ రెడ్డి పేరు మీదికి బదలాయించారు. గోపనపల్లిలోని సర్వే నెంబరు 127లో గల భూమికి హక్కు దారులెవరు అనే విషయంలో స్పష్టత లేదని అధికారులు తేల్చారు. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ గా గతంలో పని చేసిన శ్రీనివాస్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
గోపనపల్లిలోని సర్వే నెంబరు 127లో గల భూమికి సంబంధించి తమకు హక్కు ఉందని, అనుముల రేవంత్ రెడ్డి ఈ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కొల్లా అరుణ 2017 లో హైకోర్టులో రిట్ పిటిషన్ (17542/17637) వేశారు.
అనుముల కొండల్ రెడ్డి ఈ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని అనిల్ కుమార్ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి సివిల్ కోర్టులో పిటిషన్ (780/2015) దాఖలు చేశారు.
తప్పుడు డాక్యుమెంట్ల్ ఆధారంగా, తప్పుడు మ్యుటేషన్లు చేసినందుకు తప్పుడుగా రికార్డుల్లో నమోదు చేసేనందుకు గతంలో శేరిలింగంపల్లి తహసిల్దార్ గా పనిచేసిన శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపారు.
ఈ నివేదిక ఆధారంగా ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది.అత్యంత విలువైన గోపన పల్లి భూ లావాదేవిలతో పాటు ఆయన పనిచేసిన సమయంలో జరుగిన అన్ని భూ లావాదేవిలపై సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.