
జగిత్యాల: గతంలో నిర్మానుష్య ప్రాంతాల్లో మహిళలు ఒంటరిగా కనిపిస్తే మృగాళ్లు వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. కానీ ప్రస్తుతం కొందరు కామాంధులు మరింత బరితెగిస్తున్నారు. ఇళ్లు, స్కూల్, కాలేజీ ఆఫీస్... ఎక్కడయినా మహిళలు, చిన్నారులను వదిలిపెట్టడం లేదు. ముక్కుపచ్చలారని చిన్నారులు మొదలు పండు ముసలి వరకు ఎవ్వరికీ మృగాళ్ళ చేతిలో నలిగిపోతున్న అనేక ఘటనలు ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్నాయి. తాజాగా అలాంటి దారుణమే జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది.
జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాంపూర్ గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాలలో ఐదేళ్ల చిన్నారి చదువుకుంటోంది. రోజూ మాదిరిగానే ఈనెల 4వ తేదీన కూడా ఉదయం బాలిక స్కూల్ కి వెళ్లింది. స్కూల్ ప్రారంభానికి చాలాసమయం వుండటంతో విద్యార్థులు ఎక్కువగా రాలేదు. దీంతో బాలిక తన తరగదిలో ఒంటరిగా వుండగా అదే స్కూల్లో పనిచేసే అటెండర్(55) కంటపడింది. దీంతో అతడు నీచానికి ఒడిగట్టాడు.
మనవరాలి వయసుండే బాలికపై అతడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాలిక ఈ విషయాన్న బయటపెట్టలేదు.
అయితే ఈ రోజు బాలిక తనతో అటెండర్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలిక తల్లిదండ్రులు తమ కూతురుపై అఘాయిత్యానికి యత్నించిన అటెండర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటేకామారెడ్డి జిల్లాలో భిక్షాటన చేసుకుంటున్న ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడో కామాంధుడు. నిజామాబాద్ కు చెందిన ఓ కుటుంబం కామారెడ్డి పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. ఈ కుటుంబానికి చెందిన చిన్నారి భిక్షాటన కోసం బయటకు వెళ్లింది. ఇలా రామారెడ్డి రోడ్డులో భిక్షాటన చేస్తున్న బాలికపై పెయింటర్ గా పనిచేసే కనకయ్య కన్ను పడింది. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకోవాలని చూసాడు.
బిక్షాటన చేస్తున్న బాలికకు కనకయ్య డబ్బులు ఆశచూపి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారానికి యత్నించాడు. అతడి చేష్టతకు భయపడిపోయిన బాలిక గట్టిగా కేకలు వేసింది. బాలిక అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్న పెయింటర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తప్పించుకోకుండా కట్టేసి దేహశుద్ది చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అఘాయిత్యానికి యత్నించిన దుర్మార్గుడు కనకయ్య రామారెడ్డి వాసిగా పోలీసులు గుర్తించారు.