
తెలంగాణ ప్రభుత్వంపై (telangana govt) కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) ప్రశంసల వర్షం కురిపించారు. జనగామ జిల్లా కలెక్టర్ (jangaon collectorate) కార్యాలయ భవన సముదాయాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ (kcr) ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలన్నారు. తెలంగాణను 33 జిల్లాలు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి. కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ కలెక్టరేట్లలా కూడా సచివాలయాలు లేవని.. ఆదాయం లేకున్నా రెండేళ్లుగా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని వెంకటరెడ్డి ప్రశంసించారు. తెలంగాణ వచ్చింది.. మనం మనం కొట్లాడుకోవద్దని కోమటిరెడ్డి హితవు పలికారు. తెలంగాణలో రాజకీయ నాయకుల మధ్య ఘర్షణలు వద్దని వెంకటరెడ్డి సూచించారు.
ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సున్నితంగా విమర్శలు చేశారు. 15 సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. భువనగిరి సందర్శించకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలని కోమటిరెడ్డి కోరారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి అనడం భావ్యం కాదని... వెంటనే సీఎం కేసీఆర్ ఆ మాటలు ఉపసంహరించుకోవాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఆగమేఘాల మీద ప్రగతి భవన్ నిర్మించిన సీఎం... 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. శనివారం భువనగిరిలో సీఎం కార్యక్రమానికి శాంతియుతంగా వెళ్తామని ఆయన చెప్పారు. ఆలేరు, భువనగిరి నియోజక వర్గాల సమస్యలను తెలుపుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ.. జనగామ ప్రాంతాన్ని చూసినప్పుడల్లా జయశంకర్ సార్ దు:ఖపడేవారని అన్నారు. జనగామ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. బచ్చన్నపేటలో ఒకనాడు వరుసగా 8 ఏళ్లు కరువొచ్చిందని.. ఆ దృశ్యం చూసి తనకు దుఖమొచ్చిందని కేసీఆర్ గుర్తుచేశారు. పట్టుబట్టి, జట్టుకట్టి దేవాదుల పూర్తి చేసుకుని నీళ్లు తెచ్చుకున్నామని సీఎం వెల్లడించారు. మొండిపట్టుదలతో , మీ అందరి దీవెనతో ముందుకు వెళ్లామని కేసీఆర్ తెలిపారు. ఏడేళ్ల క్రితం మనం ఎక్కడ వున్నాం.. ఇవాళ ఎక్కడికి చేరుకున్నామని సీఎం ప్రశ్నించారు. ఆనాడు అనేక రకాల అపోహలు.. అయ్యేదా, పొయ్యేదా అన్నారని కేసీఆర్ గుర్తుచేశారు. సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుంటున్నామని సీఎం తెలిపారు.
ఈ ధనం, ఈ సౌభాగ్యం రావడానికి ఎంతో మంది కృషి వుందని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఇంకా అభివృద్ధిని సాధిస్తుందని సీఎం జోస్యం చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఈ స్థాయి వసతులున్న కలెక్టరేట్ లేదని కేసీఆర్ పేర్కొన్నారు. జనగామలో మూడేకరాలు వున్నోళ్లు కోటీశ్వరుడని.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణలో కరెంట్ పోదని.. విద్యుత్ శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు.