
హైదరాబాద్: ఫేక్ ఐడీ కార్డుల(Fake ID)ను పెట్టి కార్లు(Cars), టూ వీలర్లు రెంట్(Hire)కు తీసుకునేవారు. వాటితో అక్కడ నుంచి ఉడాయించేవారు. ఆ తర్వాత ఆ వాహనాల నంబర్ ప్లేట్లు మార్చేసేవారు. వాటిని తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్‌లో అమ్మేసేవారు. మరో విషయం వీరు ఐడీ కార్డులను మిత్రుల నుంచి దొంగిలించేవారు. లేదా బాయ్స్ హాస్టల్స్ ఉంటూ రూమ్‌మేట్ల దగ్గర ఐడీ కార్డులు తీసుకునేవారు. ఇలా వాహనాలు అద్దెకు తీసుకుని స్కామ్‌కు పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్(Hyderabad) పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి ఐదు ఫోర్ వీలర్లు, ఒక టూ వీలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 84.94 లక్షలు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్ భీమవరానికి చెందిన గడాటి మహేష్ నూతన్ కుమార్ బీటెక్ చేశాడు. 28 ఏళ్ల మహేష్ ఓ మొబైల్ షాప్‌లో మొబైల్ టెక్నీషియన్‌గా చేశాడు. ఆ తర్వాత ఆయ చెడు మార్గం పట్టాడు. అందుకోసం సులువుగా డబ్బులు సంపాదించే మార్గం కోసం వెతుకులాట ప్రారంభించాడు. దొంగతనాలు, చీటింగ్‌లతో పాటు సైబర్ క్రైమ్‌లకూ పాల్పడ్డాడు. ఇలాంటి పలు నేరాల్లో ఆయన వేర్వేరు రాష్ట్రాల్లో మూడు సార్లు అరెస్ట్ అయ్యాడు. తెలంగాణలో మాదాపూర్ పోలీసులూ ఓ సారి అరెస్టు చేశారు. తన చెడు వ్యసనాల కోసం ఆయన తప్పుదారి ఎంచుకున్నాడు. ఇతరుల విలువైన వస్తువులను దొంగిలించడం ప్రారంభించాడు. జూమ్ కార్స్, డ్రైవ్‌జీల నుంచి కార్లు, రాయల్ బ్రదర్ నుంచి టూ వీలర్లను అద్దెకు తీసుకుంటూ దొంగిలించే పని పెట్టకున్నాడు. ప్రైవేటు హాస్టల్స్‌లో రూమ్‌మేట్లను మచ్చిక చేసుకుని వారి వద్ద నుంచి ఆధార్ కార్డు, ప్యా న్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులను తీసుకునేవాడు. లేదంటే.. వారికి తెలియకుండానే వారి నుంచి దొంగిలించేవాడు.
ఆ ఐడీ కార్డుల సహాయంతో కార్లు, బైక్‌లను రెంట్ తీసుకునేవాడు. ఆ వాహనాల నుంచి జీపీఎస్‌ను తీసి పడేసేవాడు. ఆ తర్వాత తనకు నచ్చిన మార్గంలో పారిపోయేవాడు. ఆ వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చి తక్కువ ధరలకే ఇతరులకు అమ్మేసేవాడు. 2016 నుంచి ఆయనపై 15 కేసులు నమోదయ్యాయి. 2021 సంవత్సరంలోనే తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఈ ఏ1కు సహకరించినవారిని ఏ2, ఏ3లుగా పోలీసులు గుర్తించారు. ఏ1 నేరం చేయడంలో వీరు సహకరించేవారు. అలాగే, దొంగిలించిన వాహనాలను తమ అధీనంలో పెట్టుకునేవారు.
2017లో మలక్‌పేట పోలీసులు, 2018లో భీమవరం పోలీసులు, 2019లో ఎస్ఆర్ నగర్ పోలీసులు, 2021 మార్చి 31వ తేదీన మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఆయన నాలుగు సార్లు అరెస్ట్ అయ్యాడు. గతంలో ఆయన జైలు నుంచి విడుదల అయ్యాక మళ్లీ అేవే నేరాలు చేస్తుండేవాడు. ఈ మహేష్ భీమవరంలోని తన ఇద్దరు మిత్రులు ఏ2, ఏ3లనూ(ఏ2 గాషేక్ మునావర్, ఏ3గా కొండ సాయి మదన్ ఉన్నారు.) నేరాలకు పురికొల్పాడు. సులువుగా డబ్బులు సంపాదించే మార్గం ఇదేనని చెబుతుండేవాడు. తాజాగా, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ ఎం భాగవత్ సారథ్యంలోని పోలీసులు తాజాగా, ఈ మోసగాడిని గుర్తించి పట్టుకున్నారు.