హైద్రాబాద్ నగరంలో మూడు రోజులుగా వర్షాలకు నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ తెల్లవారుజామునుండి కురిసిన వర్షంతో టోలిచౌకి-మెహిదిపట్నం మార్గంలో వర్షం నీటితో రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్:నగరంలోని టోలిచౌకి ప్రాంతంలో రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో టోలిచౌకి-మెహిదిపట్నం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా హైద్రాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుండి భారీ వర్షం నగర వ్యాప్తంగా నమోదౌతుంది. ఇవాళ తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు చోట్ల 10 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదైంది. హైద్రాబాద్ తో పాటు నగర శివారులలో కూడ భారీగా వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.
రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. దీంతో రంగారెడ్డి, హైద్రాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని స్కూళ్లకు ప్రభుత్వం ఇవాళ సెలవును ప్రకటించింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. మూసీకి కూడ వరద పోటెత్తింది. మరో వైపు జంట జలాశయాలకు కూడ ఇన్ ఫ్లో పెరిగింది. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో ఈ రెండు ప్రాజెక్టులకు చెందిన రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైద్రాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
also read:తెంపులేని కుండపోత వర్షం: హైదరాబాద్ లో నేడు స్కూల్స్ కు సెలవు..
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. వర్ష ప్రభావిత బాధితులు సహాయం కోసం 040 21111111 నెంబర్ కు ఫోన్ చేయాలని అధికారులు కోరారు. మరో వైపు ఈవీడీఎం కంట్రోల్ నెంబర్ 9000113667 కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
తెలంగాణ ా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం సన్నద్దమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.