ఎల్బీనగర్ ప్రేమోన్మాది ఘటన : ముఖంపై, కడుపులో తీవ్ర కత్తిపోట్లు.. ఏఐజి హాస్పిటల్స్ వైద్యులేమంటున్నారంటే...

By SumaBala Bukka  |  First Published Sep 5, 2023, 9:34 AM IST

ప్రేమోన్మాది చేతిలో గాయపడిన సంఘవి శాశ్వత వైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆ పరిస్థితి రాకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. 


హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్ లో యువతిపై ప్రేమోన్మాది దాడి ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో యువతి సోదరుడు మృతి చెందగా.. యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రేమోన్మాది శివకుమార్ చేతిలో కత్తిపోట్లకు గురైన సంఘవికి గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్స్ లో చికిత్స జరుగుతుంది.

ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి దీని గురించి మాట్లాడుతూ యువతికి చికిత్స కొనసాగుతుందని చెప్పారు.  సోమవారం డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యువతిపై జరిగిన దాడి గురించి చెబుతూ.. సంఘవి శరీరంపై అనేక చోట్ల దారుణమైన రీతిలో కత్తిపోట్లు ఉన్నాయని అన్నారు. చికిత్సకు తమ డాక్టర్లు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందని తెలిపారు. 

Latest Videos

ఎల్‌బీ నగర్ ప్రేమోన్మాది ఘటన: శివ బయటకు సంఘవిని చంపేస్తాడేమో.. బాధితురాలి సోదరుడు

సంఘవి చికిత్సలో ఆస్పత్రికి చెందిన ట్రామాకేర్ బృందంలోని న్యూరో సర్జన్లు, రికన్ స్ట్రక్టివ్ ఆపరేషన్ ఎక్స్ పర్ట్స్, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ ఫిజీషియన్ల బృందం అందరూ కలిసి.. యువతికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. తమ ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి ఆమె పరిస్థితిపై కూడా నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. 

ఏఐజి ఆసుపత్రికి వచ్చే సమయానికి సంఘవి ముఖంపై అనేక కోతలు ఉన్నాయని.. శరీరంపై అనేక చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని తెలిపారు. ప్లాస్టిక్ సర్జనులు ముఖంపై ఉన్న కత్తిపోట్లకు ముందు చికిత్స చేసి అవసరమైన కుట్లు వేశారని.. దీనివల్ల ముఖం రూపం మారకుండా చూస్తున్నారని తెలిపారు.  

కత్తి దాడి విచక్షణ రహితంగా ఉండడం.. పోట్లు ఎక్కడపడితే అక్కడ పడడంతో గర్భాశయ ప్రాంతానికి సమీపంలో ఉన్న వెన్నుపాముకు ప్రాణాంతకమైన గాయాలయాయని తెలిపారు. ఈ గాయాలు ప్రధాన నరాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని చెప్పారు.

దీని కారణంగా సంఘవి వైకల్యం బారిన పడే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసమే తమ వైద్యులు కృషి చేస్తున్నారని.. దానికి సంబంధించి ఆపరేషన్లు తగిన సమయంలో చేస్తామన్నారు. 

యువతి చికిత్స మీద ఏఐజీ ఆస్పత్రి  చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మరిన్ని వివరాలు తెలుపుతూ... మొదట యువతి ప్రాణ రక్షణ మీదనే దృష్టి పెట్టామన చెప్పుకొచ్చారు. యువతి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్నామని.. ఈ గాయాల వల్ల ఆమెకు జీవితాంతం భారం కాకూడదని.. వైద్య ఖర్చులను తామే భరించాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన తెలిపారు.

సంఘవికి దీర్ఘకాలిక ఫిజియోథెరపీ అవసర పడుతుందని.. ఆమె కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు.  అందుకోసమే డిశ్చార్జ్ తర్వాత కూడా ఆమెకు తమ వైద్య బృందం సహాయం చేస్తుందని చెప్పుకొచ్చారు. తీవ్ర మానసిక వేదన నుంచి ఆమె బయటికి రావడానికి మానసిక, ఆరోగ్య కౌన్సిలింగ్ అవసరం  అవుతుందని…ఇదొక సుదీర్ఘ ప్రయాణమని ఆయన చెప్పారు. 

మరోవైపు ప్రేమపేరుతో యువతిపై దాడి చేసి ఆమె తమ్ముడిని హతమార్చిన నిందితుడు శివకుమార్ ను ఎల్బీనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాధితుల తండ్రి సురేందర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివకుమార్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఎల్బీనగర్ సిఐ అంజిరెడ్డి మాట్లాడుతూ  శివకుమార్ ను కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. ఆర్టీసీ కాలనీలోకి శివకుమార్ ఆదివారం వచ్చిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. శివకుమార్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం తెల్లవారుజామున సంఘటన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. శివకుమార్ దాడికి ఉపయోగించిన కత్తిని, అతని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

click me!