
దేశం మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫీవర్‌తో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ అభిమానులు తమ జట్లను, అభిమాన ఆటగాళ్ల ఆటను చూసేందుకు గ్రౌండ్లకు పోటెత్తుతున్నారు. అయితే కొందరు కేటుగాళ్లు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ రాచకొండ పోలీసులు నకిలీ ఐపీఎల్ టికెట్ల ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ మేరకు గురువారం ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు.
బార్ కోడ్ ద్వారా నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేస్తోంది ఈ ముఠా. నల్గొండకు చెందిన కోమటిరెడ్డి గోవర్థన్ రెడ్డితో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. ఈ సందర్భంగా భారీగా నకిలీ ఐపీఎల్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు వందలాది ఐపీఎల్ టికెట్లను ఈ ముఠా విక్రయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గత మ్యాచ్‌లో నకిలీ ఐపీఎల్ టికెట్ల వ్యవహారాన్ని గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.