
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించే అవకాశం ఉంది. తెలంగాణలో టీపీసీసీ నిర్వహించే బహిరంగ సభలో ఆమె పాల్గొననున్నారు. నిరుద్యోగం, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని పార్టీ నిర్ణయించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా మే 4 లేదా 5 తేదీల్లో నిర్వహించే సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
నిరుద్యోగం, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సమస్యలపై టీపీసీసీ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఏప్రిల్ 21న నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలు, ఏప్రిల్ 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ‘‘మే 4 లేదా 5 తేదీల్లో ఇక్కడి సరూర్ నగర్ గ్రౌండ్‌లో నిరుద్యోగుల సమస్యలపై సభ నిర్వహిస్తాం. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్‌కు వస్తారు. అయితే ప్రియాంక గాంధీ పర్యటనపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తాం’’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. యువత కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో ఈ సమావేశంలో వివరించబోతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.
దేశంలో, తెలంగాణలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ విఫలమయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని రెడ్డి డిమాండ్ చేశారు. మే 9న జోగులాంబ-గద్వాల్ జిల్లా నుంచి తన ‘హత్ సే హత్ జోడో యాత్ర’ రెండో విడత ప్రారంభమవుతుందని తెలిపారు.
అయితే తెలంగాణపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతను ప్రియాంక గాంధీకి ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా కాలంగా అంతర్గత పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి టార్గెట్‌గా విమర్శలు చేస్తూ కొందరు నేతలు పార్టీని కూడా వీడారు. పార్టీలో ఉన్న పలువురు సీనియర్ నేతలు.. రేవంత్ రెడ్డిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు రానుండటంతో.. ఆమె పార్టీలో అంతర్గత పోరును పరిష్కరించేలా నేతలకు ఏమైనా మార్గనిర్దేశం చేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి సంబంధించి ప్రియాంక గాంధీ.. కొంతమంది సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహించారని సమాచారం. పార్టీ పనితీరు, గ్రూపు రాజకీయాలను సమీక్షించారని తెలుస్తోంది. టీ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలకు గల కారణాలపై నివేదికలు తెప్పించుకుని విశ్లేషించినట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే మే మొదటి వారంలో తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రియాంక గాంధీ.. ఈలోపే పార్టీలోని పలువురు సీనియర్ నేతలతో మాట్లాడి ఎన్నికలకు సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు విభేదాలను పక్కనబెట్టి పార్టీని బలోపేతం చేయాలనే కోరే అవకాశం ఉంది.
అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. తెలంగాణలోని జిల్లాల్లో కూడా పర్యటించనున్నట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్బంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకుని.. ఎన్నికలను ఎదుర్కొవడానికి అవసరమైన వ్యుహాలపై నివేదికను సిద్దం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.