శీతాకాల విడిది కోసం రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. స్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్..

By Sumanth KanukulaFirst Published Dec 25, 2022, 2:41 PM IST
Highlights

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు(డిసెంబర్ 26) హైదరాబాద్‌కు రానున్నారు. రేపు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలకనున్నారు.

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు(డిసెంబర్ 26) హైదరాబాద్‌కు రానున్నారు. రేపు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలకనున్నారు. ఇక, శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఐదు రోజుల పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సీఎం కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా కలవనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 30న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆమెకు విందు కూడా ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. 

అయితే రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చినప్పుడు.. సీఎంలు కలవడమనేది సాధారణంగా జరిగేదే. అయితే గత  కొంతకాలంగా చోటుచేసుకున్న  రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతిని కేసీఆర్ కలవనుండటం కొంత ఆసక్తికరంగా మారింది. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చిన పలు సందర్బాల్లో కేసీఆర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలకడం గానీ, ఆయనతో భేటీ కావడం కానీ జరగలేదు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. యశ్వంత్ సిన్హాను హైదరాబాద్‌కు రప్పించి గొప్పగా సభ కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించిన తర్వాత కేసీఆర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

రెండేళ్ల తర్వాత శీతకాల విడిదికి రాష్ట్రపతి.. 
శీతకాల విడిది కోసం 2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చివరిసారిగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ -19 పరిస్థితుల కారణంగా రాష్ట్రపతి శీతకాల విడిది  కోసం హైదరాబాద్‌కు రాలేదు. ఇప్పుడు రెండేళ్ల విరామం తర్వాత ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక, ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము.. శీతకాల విడిదికి రావడం  ఇదే తొలిసారి. ఇక, రాష్ట్రపతి బస చేయనున్న బొల్లారంలోని భవనాన్ని 1860లో నాటి నిజాం నాజిర్ ఉద్దౌలా హయాంలో నిర్మించారు. బ్రిటీష్ రెసిడెంట్ కంట్రీ హౌస్‌గా దీన్ని వినియోగించుకున్నారు. ఆపరేషన్‌ పోలో తర్వాత హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కాగా.. ఆ తర్వాత నుంచి ఈ భవనాన్ని రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్నారు. 

రేపు శ్రీశైలంకు రాష్ట్రపతి ముర్ము.. 
సోమవారం హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు బస చేసిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలానికి చేరుకుంటారు. శ్రీశైలంలో స్వామిఅమ్మవార్ల దర్శనం చేసుకుంటారు. రాష్ట్రపతి పర్యటనను అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని నంద్యాల కలెక్టర్‌ మునజీర్‌ జిలానీ సామూన్‌ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నల్లమల అడవులను గ్రేహౌండ్స్ దళాలు జల్లెడ పడుతున్నాయి. శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు, శిఖరేశ్వరం సమీపంలోని నల్లమల అడవుల్లో గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
 

click me!