తెలంగాణ: అమల్లోకి పీఆర్‌సీ.. కనీస వేతనం రూ 19 వేలు, కనీస పింఛన్‌ రూ 9,500

By Siva KodatiFirst Published Jun 11, 2021, 9:58 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్‌సీ పెంపు అమలు ఉత్తర్వుల్ని శుక్రవారం జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,21,037 ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది, పింఛన్‌దారులందరికీ 30 శాతం ఫిట్‌మెంట్‌ అమలు కానుంది

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్‌సీ పెంపు అమలు ఉత్తర్వుల్ని శుక్రవారం జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,21,037 ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది, పింఛన్‌దారులందరికీ 30 శాతం ఫిట్‌మెంట్‌ అమలు కానుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలకు పెరగనుంది.

2018 జులై 1 నాటికి ఉన్న డీఏ 30.392 శాతం మూల వేతనంలో కలుస్తుంది. మొత్తం 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయనుండగా.. అందుకు అనుగుణంగా ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను ప్రభుత్వం సవరించింది. జూన్‌ నెల నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి. ఏప్రిల్‌, మే నెల బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.  

Also Read:పీఆర్‌సీ రగడ: ఆంధ్రా కంటే ఎక్కువే ఇస్తా... ఉద్యోగులకు కేసీఆర్ హామీ

2018 జులై 1 నుంచి నోషనల్‌ బెనిఫిట్‌, 2020 ఏప్రిల్‌ 1 నుంచి మానిటరీ బెనిఫిట్‌, 2021 ఏప్రిల్‌ 21 నుంచి క్యాష్‌ బెనిఫిట్‌ను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో హెచ్‌ఆర్‌ఏ 24 శాతానికి తగ్గనుంది. కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, రామగుండం, వరంగల్‌లో 17 శాతం;  50వేల నుంచి 2 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో 13 శాతం; ఇతర ప్రాంతాల్లో 11 శాతం అమలు కానుంది.

పింఛనర్లకు 36 వాయిదాల్లో బకాయిలు చెల్లించనున్నారు. 2018 జులై తర్వాత పదవీ విరణమ చేసినా 2020 పీఆర్‌సీ ప్రకారమే పింఛన్‌ను అందించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కనీస పింఛన్‌ రూ.6,500 నుంచి రూ.9,500 వరకు పెరగనుంది. రిటైర్‌మెంట్‌ గరిష్ఠ గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. పింఛన్‌దారుడు, కుంటుంబీకులకు మెడికల్‌ అలవెన్స్‌ నెలకు రూ.600 పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులు, పింఛనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా పది ఉత్తర్వులు జారీ చేసింది.  

వీరికి 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ గతంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. తాజాగా దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది.పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది

click me!