Prashant Kishor: బీఆర్ఎస్‌కు గడ్డుకాలమేనా? అలాగైతే ప్రమాదంలో పడినట్టే: ప్రశాంత్ కిశోర్

By Mahesh KFirst Published Mar 4, 2024, 12:06 AM IST
Highlights

బీఆర్ఎస్ పార్టీపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం అని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు గడ్డు కాలమే అని అభిప్రాయపడ్డారు.
 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఆ పార్టీకి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అధికారం నుంచి ప్రతిపక్షంలో పడగానే ఆ పార్టీ వేగంగా బలహీనపడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎంపీ ఎన్నికల్లో రాణించాలని ఆ పార్టీ భావిస్తున్నది. కానీ, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలే పార్టీలు మారుతున్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పుంజుకోవద్దనే ఎక్కువగా వ్యూహాలు రచించినట్టు అప్పట్లో చర్చ జరిగింది. కావాలనే బీఆర్ఎస్.. బీజేపీనే లేపిందని చెబుతుంటారు. తద్వార కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని కేసీఆర్ అనుకున్నారని చర్చిస్తుంటారు. కానీ, ప్రత్యేక తెలంగాణలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా అధికారంలోకే వచ్చేసింది. ఈ సమయంలో బీజేపీ పుంజుకుంటే.. బీఆర్ఎస్‌కు మూడినట్టేనని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. ఇది బీఆర్ఎస్‌కు గడ్డుకాలమేనని పేర్కొంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ఎంపీ స్థానాలను పది (17లో 9 ఎంపీ సీట్లను గెలుచుకుంది) తెచ్చుకోలేకపోయింది. అదీగాకుండా.. కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ ఎంపీల సంఖ్యను పెంచుకునే అంచనాలు ఉన్నాయి. దీంతో దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. ఎంపీ ఎన్నికల్లోనూ భంగపడాల్సి రావొచ్చు. కాంగ్రెస్ ఎట్లాగూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. కాబట్టి, ఆయా సెగ్మెంట్‌లలోని ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాల కోసం శాయశక్తుల ప్రయత్నిస్తారు.

Also Read: YSR Congress Party: ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు వైసీపీ మంత్రుల కౌంటర్

ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఓ సదస్సుకు హాజరైన ఆయన తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితిపై కామెంట్ చేశారు. తాను ఒక వేళ బీఆర్ఎస్ వర్కర్‌ను అయి ఉంటే పార్టీ ప్రస్తుత స్థితిపై ఆందోళన చెందేవాడినని వివరించారు. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం అని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు గడ్డు కాలమే అని అభిప్రాయపడ్డారు.

click me!