చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీపై అనిశ్చితి నెలకొంది. తాను మరోసారి బరిలో దిగేది లేనిది ఆయన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేపదు. దీంతో గులాబీ దళపతి ప్రత్యామ్నాయ నేతల పేర్లను పరిశీలిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఢీలా పడిపోయాయి. వరుసగా రెండుసార్లు అధికారంలో వుండటం.. ఇప్పుడు పవర్ లేకపోవడంతో గులాబీ దండు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. వారిని తిరిగి యాక్టీవ్ చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావులు తీవ్రంగా శ్రమించారు. సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్ సైతం తుంటి ఎముకకు గాయం కావడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే ఆయన జనంలోకి వస్తున్నారు. కొద్దిరోజుల క్రితం నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై వాడి వేడి విమర్శలు చేశారు.
మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోవాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి, లేనిపక్షంలో బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదం. ఈ నేపథ్యంలో కేసీఆర్ వేగం పెంచారు. లోక్‌సభ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలను కైవసం చేసుకుని పట్టు పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌కు వచ్చిన చంద్రశేఖర్ రావు.. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నేతలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.
ఇదిలావుండగా.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించి మంచి ఊపు మీదుంది. కాంగ్రెస్ కూడా రేపో, మాపో అభ్యర్ధులను ప్రకటిస్తుంది. ఈ లిస్ట్‌లో వెనుకపడకుండా వుండాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్ధుల ఎంపికపై ఆయన కసరత్తు ప్రారంభించారు. అయితే చేవేళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీపై అనిశ్చితి నెలకొంది.
తాను మరోసారి బరిలో దిగేది లేనిది ఆయన ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేపదు. దీంతో గులాబీ దళపతి ప్రత్యామ్నాయ నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణ భవన్‌లో చేవేళ్ల నియోజవకర్గానికి చెందిన నేతలు కొప్పులు మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పైలెట్ రోహిత్ రెడ్డిలతో చర్చలు జరిపారు.
అయితే వీరు ముగ్గురు తమకు ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి లేదని తెలిపారు. దీంతో పార్టీ ప్రతిపాదించిన అభ్యర్ధి విజయానికి కృషి చేయాలని కేటీఆర్ వారికి సూచించారు. చేవేళ్ల బరిలో కాసాని వీరేశం, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేర్లను బీఆర్ఎస్ పార్టీ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. మరి వీరిలో ఎవరికి కేసీఆర్ టికెట్ ఖరారు చేస్తారో చూడాలి.