ప్రణయ్ హత్య: 1200 పేజీలతో చార్జీషీట్, ఏ-1 మారుతీరావు

By narsimha lodeFirst Published Mar 10, 2020, 10:19 AM IST
Highlights

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  ప్రణయ్ హత్య  కేసులో మిర్యాలగూడ పోలీసులు  మంగళవారం నాడు చార్జీషీట్ దాఖలు చేశారు. 

మిర్యాలగూడ:  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  ప్రణయ్ హత్య  కేసులో మిర్యాలగూడ పోలీసులు  మంగళవారం నాడు చార్జీషీట్ దాఖలు చేశారు. 1200 పేజీలతో పోలీసులు చార్జీషీటు కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1 నిందితుడుగా మారుతీరావును చేర్చారు పోలీసులు ఏ-6 నిందితుడుగా శ్రవణ్‌కుమార్‌ను చూపారు. 

1200 పేజీల చార్జీషీటులో ఫస్ట్ పేజీ నుండి నాలుగవ పేజీ వరకు బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పొందుపర్చారు. ప్రణయ్ తండ్రి బాలస్వామితో పాటు ప్రణయ్ భార్య సతీమణి అమృత ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు  చార్జీషీట్‌లో చేర్చారు.  

Also read:ఆస్తిపై ఆశ లేదు, శ్రవణ్ కూతురు నెట్టేసింది: అమృత

ఈ కేసులో సుమారు 102 మంది సాక్షులను పోలీసులు రికార్డు చేశారు. హత్యకు ముందు  హత్య తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలను కూడ పోలీసులు ఇందులో పొందుపర్చారు.   6వ పేజీ నుండి 14వ పేజీ వరకు సాక్షులు చెప్పిన అంశాలను పోలీసులు  చార్జీషీట్‌లో పేర్కొన్నారు. 

చార్జీషీట్ 16వ పేజీలో ప్రణయ్ హత్య  ఎలా జరిగిందనే విషయమై పోలీసులు  ప్రస్తావించారు. ప్రణయ్‌ను అత్యంత దారుణంగా ఎలా హత్య చేశారో 16వ పేజీలో పోలీసులు  రాశారు.

 కిరాయి హంతకుల దాడిలో ప్రణయ్ గొంతు, తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన మృతి చెందిన విషయాన్ని పోలీసులు చెప్పారు.41వ పేజీ నుండి 44వ పేజీల్లో నిందితుల పేర్లను పోలీసులు  చేర్చారు. ఏ-1 నిందితుడుగా ప్రణయ్ మామా మారుతీరావు పేరును చేర్చారు.

ఆ తర్వాత ప్రణయ్ ను హత్య చేసిన వ్యక్తి పేరును చేర్చారు. ఏ-3 గా అస్ఘర్ అలీ పేరును చేర్చారు. ఏ-5 నిందితుడుగా కరీం పేరును, ఏ-6 నిందితుడుగా మారుతీరావు సోదరుడు శ్రవణ్ కుమార్ పేరును చేర్చారు.

 నిందితులు పేర్లు పొందుపర్చిన  తర్వాత ప్రణయ్ తండ్రి బాలస్వామి రాసిన ఫిర్యాదు కాపీని పోలీసులు చార్జీషీట్‌కు జతచేశారు.  అమృత, ప్రణయ్ పరిచయం ప్రేమ, పెళ్లితో పాటు హత్యకు దారితీసిన పరిస్థితులను కూడ పోలీసులు చార్జీషీటులో  సవివరంగా రాశారు. 

పెళ్లి చేసుకొంటే నిన్నే చేసుకొంటా లేకపోతే ఇద్దరం కలిసి చనిపోదామని అమృత ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన ప్రణయ్ 2018లో హైద్రాబాద్ ఆర్యసమాజ్ మందరింలో పెళ్లి చేసుకొన్నట్టుగా పోలీసులు  గుర్తు చేశారు.

 పెళ్లి తర్వాత కూడ అమృతను తన ఇంటికి తీసుకొచ్చుకోవాలని మారుతీరావు రాయబారం నడిపించారు. కానీ అమృత మాత్రం అందుకు ఒప్పుకోలేదు. 

కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకొని పరువు తీసిందని  మారుతీరావు మదన పడ్డారు. ఈ విషయమై ప్రణయ్ ను చంపేందుకు ప్లాన్ చేశాడు.  సుఫారీకి అవసరమైన డబ్బులను సమకూర్చాలని తమ్ముడు శ్రవణ్ కుమార్ కు చెప్పినట్టుగా పోలీసులు చార్జీషీట్‌లో పేర్కొన్నారు.

నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఈ చార్జీషీట్ ను 20 దఫాలు మార్చి రాయించారు. నిందితులకు శిక్ష పడేలా చార్జీషీటును పకడ్బందీగా రాయించినట్టుగా సమాచారం. 
2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ ను మిర్యాలగూడ జ్యోతి ఆసుపత్రి వద్ద హత్యకు గురయ్యాడు.

click me!