టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ ఆయన నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. వరద బాధితులను పరామర్శించడం లేదనే ఆగ్రహం స్థానికుల్లో ఉందని, ఆ ఆగ్రహంతోనే కొందరు పోస్టర్లు వేశారని చెబుతున్నారు. అయితే, ఈ పోస్టర్ల వెనుక బీఆర్ఎస్ హస్తం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరిలో ఈ పోస్టర్లు గోడలకు అతికించి కనిపించాయి. స్థానికులే తమ ఎంపీ పై ఆగ్రహంతో ఈ పోస్టర్లు అతికించారని చెబుతున్నారు. వరదలు వచ్చి మల్కాజ్‌గిరి నియోజకవర్గ ప్రజలు అల్లాడిపోతున్న.. తమ ఎంపీ కనీసం పరామర్శించడానకైనా రాలేదనే ఆగ్రహం నెలకొని ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ ఆగ్రహంతోనే రేవంత్ రెడ్డి మిస్సింగ్ అనే పోస్టర్లు వేశారని కొందరు చెబుతున్నారు.
2020లోనూ వరదలు ముంచెత్తినప్పుడు కూడా ఎంపీ రేవంత్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరిలో పర్యటించలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కూడా రాజధాని నగరంలో వర్షం కొన్నిరోజులుగా కుండపోతగా పడుతున్నది. ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వరద నీళ్లు ఇళ్లలోకి చేరుతుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన మల్కాజ్‌గిరికి రాలేదని పేర్కొంటున్నారు.
“Malkajgiri MP Revanth Reddy Missing” posters spring up across the constituency pic.twitter.com/Pn867DwRi5
— Naveena (@TheNaveena)
వర్షాలు భారీగా కొడుతున్న తరుణంలో వరద బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అయితే, కాంగ్రెస్ ఆందోళనలను బీఆర్ఎస్ తిప్పికొట్టింది. ఈ కఠిన సమయంలోనూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని, ప్రజలకు సహాయం చేయాలని హితవు పలికింది.
ఈ పోస్టర్లు అతికించడం వెనుక అధికార బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ వరద బాధఇతులను పట్టించుకోవడం లేదనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే కుట్ర చేస్తున్నట్టు పేర్కొన్నాయి.
Also Read: ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ భేటీ: భారీ వర్షాలు సహా ఇతర అంశాలపై చర్చ
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రజల్లో తిరుగుతూ వారికి భరోసా ఇస్తున్నారు. పరామర్శిస్తున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, సహాయక సిబ్బందికీ సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఓ హెలికాప్టర్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.