
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపికి మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అడపాదడపా హైదరాబాదులో పోస్టర్ వార్ కనిపిస్తుంది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఈ క్రమంలోనే మళ్లీ హైదరాబాదులో పోస్టర్లు వెలిశాయి. ఉప్పల్ టు నారపల్లి ఫ్లై ఓవర్ కు సంబంధించి ఈ పోస్టర్లు ఉన్నాయి. ఈ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమై ఏళ్లకేళ్లు గడుస్తున్నాయి కానీ సగం కూడా పూర్తి కాలేదని.. దీన్ని విమర్శిస్తూ పోస్టర్లు పడ్డాయి. ‘మోడీ గారు ఈ ఫ్లైఓవర్ ను ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు?’ అని ప్రశ్నించారు.
ఉప్పల్- నారపల్లి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ప్రారంభించి ఐదు సంవత్సరాలైనా కూడా పూర్తి కాలేదని అందులో పేర్కొన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ కడతారని ప్రశ్నించారు. ఈ మేరకు ఈ పోస్టర్లను ఫ్లై ఓవర్ పిల్లర్ల మీద అతికించారు. ఈ పోస్టర్లలో మోడీ ఫోటోను కూడా ముద్రించారు. హైదరాబాద్- వరంగల్ నేషనల్ హైవే లో ఉన్న ఫ్లై ఓవర్ పిల్లర్లకు ఇవి దర్శనమిచ్చాయి. ఈ పోస్టులను గుర్తు తెలియని వ్యక్తులు అంటించినట్టుగా తెలుస్తుంది.
ఎల్బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు.. మెట్రోను ఎయిర్‌పోర్టు వరకు తీసుకెళ్తాం: మంత్రి కేటీఆర్
వీటితో పాటు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లర్లపై కూడా ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. 6 కిలోమీటర్ల మేర ఈ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులు నడుస్తున్నాయి. ఈ మేరకు ఈ పిల్లర్లపై పోస్టర్లు అడుగడుగునా కనిపిస్తున్నాయి. దీంతో స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, మార్చి 25న హైదరాబాద్ ఎల్‌బీ నగర్ జంక్షన్‌లో మంత్రి కేటీఆర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. రూ. 32 కోట్లతో.. 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఒక్క ఎల్బీనగర్ లోనే ఎస్సార్ డీపీలో భాగంగా 12 ప్రాజెక్టులు చేపట్టినట్టుగా తెలిపారు. దీంట్లో భాగంగానే 9వ ప్రాజెక్టును ప్రారంభించినట్లుగా తెలిపారు. మిగతా మూడు ప్రాజెకులు కూడా ఈ సెప్టెంబర్ లోగా పూర్తిచేస్తామన్నారు.
ఈ ఫ్లైఓవర్ ప్రారంభం వల్ల ఎల్బీనగర్ చౌరస్తాో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చన్నారు. ఇంకా ప్రజారవాణ మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్బీనగర్ లోని ఈ పనులన్నీ పూర్తి చేశాకే ఎన్నికలకు వెల్తామన్నారు. భవిష్యత్తులో ఎల్బీ నగర్ కు నాగోల్ మెట్రోను జోడిస్తామని తెలిపారు. ఎల్‌బీ నగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను తీసుకెళ్తామని.. వచ్చే టర్మ్‌లో ఆ పనిని పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఎల్‌బీ నగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతూ తగిన ఆదేశాలు జారీచేస్తామని కేటీఆర్ చెప్పారు. ఎల్‌బీ నగర్ చౌరస్తాకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరును, ఈ ఫ్లై ఓవర్‌కు మాల్-మైసమ్మ పేరును పెట్టాలని వారు కోరారని ఈ మేరకు పెడతామన్నారు.