వైఎస్ జగన్ తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి: కేసీఆర్ కు షాక్?

By Pratap Reddy KasulaFirst Published Jan 21, 2022, 10:10 AM IST
Highlights

టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ లో శ్రీనివాస్ రెడ్డికి ప్రాధాన్యం తగ్గిన నేపథ్యంలో ఆ భేటీకి రాజకీయ ప్రాధాన్యం చేకూరింది.

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. దీంతో ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాక్ ఇస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పార్టీలో తనకు ఏ మాత్రం ప్రాధాన్యం దక్కడం లేదని onguleti Srinivas Reddy ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ తో సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీకి చెందిన తుమ్మల నాగేశ్వర రావు, నామా నాగేశ్వర రావు వంటి నేతలు టీఆర్ఎస్ లో చేరారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాధాన్యం టీఆర్ఎస్ లో తగ్గినట్లు భావిస్తున్నారు. YS jagan ను కలిసిన నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

TRSను వీడితే ఆయన ఎటు వైపు వెళ్తారనేది కూడా చర్చనీయాంశంగానే ఉంది. వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ వైఎఎస్సార్ పార్టీని స్థాపించి ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి KCR మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ షర్మిల పార్టీలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదనే మాట వినిపిస్తోంది.

ఇదిలావుంటే, వైఎస్ జగన్ కు, కేసీఆర్ కు మధ్య మంచి సంబంధాలున్నాయి. కేసీఆర్ తో కయ్యం పెట్టుకోవడానికి జగన్ సిద్ధంగా లేరు. వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీలో చేరిన సందర్భంలోనే ఆయన ఆ విషయం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో విభేదాలు సృష్టించుకోవడం ఇష్టం లేదని, అందుకే తాము తెలంగాణలో వైసీపీని విస్తరించడం లేదని జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అప్పట్లో చెప్పారు. అందువల్ల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో జగన్ కేసీఆర్ ను నొప్పించే పని చేస్తారని అనుకోలేం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందు జగన్ తో చెప్పి, తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.

click me!