
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మార్క్‌ను సునాయసంగా దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి 54 స్థానాలు గెలుచుకుని మరో 82 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నది. కాగా, బీజేపీ 20 సీట్లు గెలుచుకుని 44 స్థానాల్లో ముందంజలో ఉన్నది. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. ఇందులో 70 క్లిష్టమైన నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టడం వల్ల ఇది సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం వెనుక ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు పాత్ర ప్రధానంగా ఉన్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు బీజేపీ వైపు ఉండటం గమనార్హం. అప్పుడు బీజేపీ 104 స్థానాలను గెలుచుకుంది.
‘గత ఎనిమిది నెలల్లో మేం ఐదు సర్వేలు నిర్వహించాం’ అని ఓ కాంగ్రెస్ నేత తెలిపారు. చివరిలో ఎంపిక చేసిన వారు మినహా ప్రాథమికంగా ఎంచుకున్న అభ్యర్థులంతా సునీల్ కనుగోలు సూచించినవారే. సునీల్ కనుగోలు, ఆయన టీమ్ నిర్వహించిన సర్వే ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసింది. ఈ సర్వే ఆధారంగానే 70 క్లిష్టమైన స్థానాలను గుర్తించామని ఓ కాంగ్రెస్ నేత తెలిపారు. ఆ స్థానాల్లో ఏఐసీసీ ఇంచార్జీలు ఫోకస్ పెట్టారు. దేశవ్యాప్తంగా అబ్జర్వర్‌లను ఈ నియోజకవర్గాలకు రప్పించారు.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం నియమించిన టాస్క్ ఫోర్స్‌లో సునీల్ కనుగోలును సభ్యుడిగా గతేడాది మే నెలలో అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధఈ నియమించింది. ఆ టాస్క్ ఫోర్స్‌లో సీనియర్ నేతలు చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా, రణదీప్ సుర్జేవాలాలు ఉన్నారు.
Also Read: కర్ణాటక ప్రజలు మోదీని, కేసీఆర్‌ను ఓడించారు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
కర్ణాటక విజయం.. తెలంగాణలో ఉత్సాహం:
సునీల్ కనుగోలును ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. ఆయన కర్ణాటకలో కాంగ్రెస్‌ను గద్దెనెక్కించడంలో కృతకృత్యుడయ్యారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్ తరఫున సునీల్ కనుగోలు పని చేయబోతున్నారు. ఇక్కడ కూడా ఆయన కాంగ్రెస్‌కు అధికార అందలాన్ని ఇప్పించడం సఫలమవుతారా? అనే చర్చ కూడా మొదలైంది.
తెలంగాణలో రెండు సార్లు అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్‌కు ప్రజాధారణ ఉన్నది. బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే బీజేపీ పుంజుకోవడానికి వీలు చిక్కిందనేది విశ్లేషకుల మాట. అందుకే కాంగ్రెస్‌కు స్కోప్ రావడం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్‌కు దశాబ్దాల తరబడి ఉన్న ఓటు బ్యాంకు మొత్తంగా నిర్వీర్యమైపోయిందని చెప్పలేం. సరైన రీతిలో పకడ్బందీగా క్యాంపెయిన్ చేస్తే అద్భుతం జరగ వచ్చేమోనని కాంగ్రెస్ అభిమా నుల్లో ఉన్నది. ఈ నేపథ్యంలోనే సునీల్ కనుగోలు కర్ణాటకలో తన నైపుణ్యాన్ని నిరూపించుకోవడం తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నట్టు తెలుస్తున్నది.
ప్రశాంత్ కిశోర్‌తో ఎప్పుడు విడిపోయారంటే?
కాంగ్రెస్‌లో చేరడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిరాకరించిన తర్వాత కొన్ని వారాలకు సునీల్ కనుగోలు ఈ టాస్క్ ఫోర్స్‌లో చేరారు. సునీల్ కనుగోలు ఆన్‌లైన్‌లో ఎక్కడా కనిపించరు. ప్రశాంత్ కిశోర్‌లా కాకుండా ఒంటరిగానే ఎక్కువగా ఉంటారు. పని విధానం కూడా పూర్తిగా వేరు. వీరిద్దరూ 2014 వరకు కలిసి పని చేశారు. ఆ తర్వాత వేరుపడిపోయారు.
2016లో ఎంకే స్టాలిన్ క్యాంపెయిన్ డిజైన్ చేసి సునీల్ కనుగోలు పుంజుకున్నారు. ఆ ఎన్నికల్లో డీఎంకే గెలవకపోయినా స్టాలిన్ మాత్రం ఒక నాయకుడిగా గుర్తింపు సాధించారు. ఆ తర్వాత సునీల్ కనుగోలు 2018 ఫిబ్రవరి వరకు ఢిల్లీలో అమిత్ షాతో క్లోజ్‌గా పని చేశారు. ఆ తర్వాత యూపీ, ఉత్తరాఖండ్, కర్ణాటకల్లో 300 మంది టీమ్ సహాయంతో పని చేశారు.
సునీల్ కనుగోలు లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తుంటారు. తన సామర్థ్యం ఏమిటో తనకు స్పష్టంగా తెలిసిన వ్యక్తి. అందుకే క్లయింట్‌కు అద్భుతాలేమీ మాటలతో చూపించరు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయనను పోల్ స్ట్రాటజిస్ట్‌గా నియమించుకుంది. సునీల్ కనుగోలు ఆయన అభిప్రాయాలను పార్టీపై రుద్దరు. పార్టీని అర్థం చేసుకుని దానితో పని చేస్తారని ఓ కాంగ్రెస్ నేత తెలిపారు.