
విక్రం గౌడ్ కాల్పుల ఘటన క్షణ క్షణం అనూహ్య మలుపులు తిరుగుతున్నది. ఈ ఘటనలో వాస్తవాల సేకరణలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విక్రం గౌడ్ తన వద్ద ఉన్న గన్ తోనే కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఆ గన్ లైసెన్ష్ లేనిదని పోలీసుల విచారణలో తేలింది. దోంతో ఆ గన్ స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ గన్ దొరకలేదు. దాన్ని ఎక్కడ దాచిపెట్టారో అనేదానిపై విచారణ జరుగుతున్నది.
మరోవైపు విక్రం భార్య షిపాలి వైఖరి అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ముందుగా దర్గా వద్ద అన్నదానం చేస్తున్నామని, తర్వాత పెద్దమ్మ గుడి వద్ద అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు పోలీసులు అంటున్నారు. మరోవైపు తన భర్తను తానే కారులో ఆసుపత్రికి తరలించానని ఆమె చెప్పారు. కానీ కారులో ఆమెతోపాటు చాలా మంది ఉన్నట్లు ఆసుపత్రి సిసి పుటేజ్ లో వెల్లడైంది.
దీనికితోడు అసలు విక్రం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుగా సంసిద్ధంగా లేదు. కానీ పోలీసులు వత్తిడి చేసి ఆమె చేత ఫిర్యాదు చేయించారు. బయటివారు కాల్చి పారిపోయారంటూ ఆమె ఫిర్యాదు ఇచ్చారు. కానీ బయటివారెవరూ రాలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇక విక్రం గౌడ్ కాల్పుల తర్వాత రక్తపు మరకలు ఎందుకు తుడిచేశారు? ఎవరు తుడిచేశారు అన్నదానిపైనా షిపాలి సమాధానాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
మరోవైపు ఆసుపత్రిలో విక్రం ఇప్పటివరకు నోరు మెదపడంలేదని పోలీసులు అంటున్నారు. ఆయన నోరు విప్పితేనే అసలు వాస్తవాలు బయటకొస్తాయని అంటున్నారు. మరోవైపు విక్రం కు ఛాయ్ తప్ప మందు, సిగరేట్, లాంటివి కూడా తీసుకునే అలవాటే లేదని షిపాలి తండ్రి అంటున్నాడు. అలాంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడంటే ఉత్తముచ్చటే అన్నారు. ఇక షిపాలి, విక్రం కలిసే ఈ ఫైరింగ్ ఘటనకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అవసరమైతే కేసు సెక్షన్లను మార్చేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. పొంతన లేని నమ్మశక్యం లేని సమాధానాలు చెబుతున్న విక్రం భార్య షిపాలి పైనా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విక్రం గౌడ్ వద్ద లైసెన్స్ లేని ఆయుధం ఎలా వచ్చింది. అది ఇప్పుడు ఎక్కడుంది?
అప్పుల బాధ నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే ఈ కాల్పుల ఘటన సౄష్టించారా అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అనూహ్య మలుపులు తిరుగుతున్నది విక్రం గౌడ్ కాల్పుల కేసు.