సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న కాచీబౌలీ కాలనీని పోలీసులు ఖాళీ చేయించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ స్టోర్ దుకాణంలో అగ్ని ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న కాచీబౌలి కాలనీని పోలీసులు ఖాళీ చేయించారు.. మంటలను ఈ కాలనీకి వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ మంటలు వ్యాపించినా పెద్ద ఎత్తున ప్రమాదం జరగకుండా ఉండేందుకు గాను ఈ కాలనీలో గ్యాస్ సిలిండర్లను పోలీసులు దూరంగా తరలిస్తున్నారు. ఈ భవనంలో సింథటిక్, రెక్సిన్ వంటి పదార్ధాలు ఉండడంతో మంటలు మళ్లీ వ్యాపించాయి. కింది ఫ్లోర్ నుండి మంటలు భవనం మొత్తం వ్యాపిస్తున్నాయి.
మంటల ధాటికి అద్దాలు పగిలిపోతున్నాయి. అంతేకాదు మంటలధాటికి భవనంలో శబ్దాలు విన్పిస్తున్నాయి. ఈ భవనంలో ఎనిమిది సిలిండర్లు ఉన్నాయని ఈ భవనం నుండి బయటపడిన సిబ్బంది సమాచారం ఇచ్చారు. అయితే ఈ సిలిండర్లను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించారు. మంటల ధాటికి సిలిండర్లు పేలిపోయే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంటల ధాటికి భవనం కూడా దెబ్బతిని కూలిపోయే అవకాశం ఉన్నందున భవనం చుట్టుూ ఎవరూ లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ భవనంలో మంటలను ఆర్పేందుకు 10 ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. డెక్కన్ నైట్ వేర్ దుకాణంలోని ఐదు అంతస్థుల్లో మంటలు వ్యాపించాయి. గాలి తీవ్రత కారణంగా పక్క భవనానికి కూడా మంటలు అంటుకున్నాయి,. ఈ ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు ముందే ఈ భవనంలోని వారిని ఖాళీ చేయించారు.
also read:సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలో అగ్నిప్రమాదం: రెస్క్యూకు వెళ్లిన ముగ్గురికి అస్వస్థత
మంటల తీవ్రతకు ఫైర్ ఫైటర్లు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మటలు తీవ్రతతో వేడి బయటకు వస్తోంది. ఈ భవనం వెనుక వైపు నుండి మంటలను ఆర్పే ప్రయత్నాలను అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. భవనం ముందు వైపు నుండి మంటలను ఆర్పేందుకు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ భవనంలో మంటలు అదుపులోకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.