
హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. గురువారంనాడు రామ్‌గోపాల్ పేట లోని డెక్కన్ నైట్ వేర్ స్టోర్ భవనం వద్ద ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.
ఈ భవనంలో ఉన్న కొందరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్టుగా మంత్రి చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఇంకా ఈ భవనంలోని కింద భాగంలో ఇద్దరు ఉన్నట్టుగా అనుమానం వ్యకం చేస్తున్నామన్నారు. వీరికి ఫోన్లు చేసినా కూడా ఫోన్లు పనిచేయడం లేదన్నారు. ఈ భవనంలో ఉన్న వస్త్రాల దుకాణంలో భారీ ఎత్తున మెటీరియల్ ఉందన్నారు. దీని కారణంగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి ఉంటాయని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే అగ్నిమాపక, మున్సిపల్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేసినట్టుగా మంత్రి వివరించారు. మరో నాలుగైదు గంటల్లో మంటలను ఆర్పుతామని మంత్రి తలసాని శ్రీినివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
also read:సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్ని ప్రమాదం: నలుగురిని రక్షించిన ఫైర్ సిబ్బంది
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి చెప్పారు. మూడు గంటలుగా అన్ని శాఖల అధికారులు శ్రమిస్తున్నా కూడా మంటలు, పొగ అదుపులోకి రాలేదని మంత్రి తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఇళ్ల మధ్య తయారీ కేంద్రాల గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇళ్ల మధ్య ఈ తరహలో ఉన్న తయారీ కేంద్రాలను తొలగించే ప్రయత్నిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. అయినా కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. అవసరమైతే స్పెషల్ డ్రైవ్ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు.