భైంసాలో భారీగా పోలీసులు మోహరింపు.. కరీంనగర్‌లోనే బండి సంజయ్.. పాదయాత్రపై సందిగ్దత

By Sumanth KanukulaFirst Published Nov 28, 2022, 12:41 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సి ఉన్న ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రపై సందిగ్దత నెలకొంది. పోలీసులు బండి సంజయ్ పాదయాత్రకు,  బహిరంగ సభకు అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సి ఉన్న ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రపై సందిగ్దత నెలకొంది. పోలీసులు బండి సంజయ్ పాదయాత్రకు,  బహిరంగ సభకు అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు నిర్మల్‌ జిల్లా భైంసాలో భారీగా పోలీసులను మోహరించారు. బీజేపీ బహిరంగ సభ జరగాల్సిన ప్రాగంణాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. పలువురు బీజేపీ నాయకులను, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసులు తీరును తప్పుబట్టారు. కావాలనే బండి సంజయ్ పాదయాత్రను, బహిరంగ సభను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ భైంసాకు వస్తుంటే కేసీఆర్ ఎందుకు భయం అని ప్రశ్నించారు. 

ఇదిలా ఉంటే.. షెడ్యూల్ ప్రకారం బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర నేడు భైంసాలో ప్రారంభం కావాల్సి ఉంది. అక్కడ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా బీజేపీ ప్లాన్ చేసింది. ఈ సభకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే పాదయాత్రను ప్రారంభించేందుకు నిర్మల్‌కు వెళుతుండగా ఆదివారం సాయంత్రం జగిత్యాల జిల్లా వెంకటాపూర్ పోలీసులు బండి సంజయ్‌ను అడ్డుకున్నారు. పాదయాత్రకు, సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నట్టుగా చెప్పారు. 

Also Read: బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ..

ఈ క్రమంలోనే పోలీసులకు, బండి సంజయ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా బండి సంజయ్ పాదయాత్రకు అడ్డంకులు కల్పిస్తున్నారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. అనంతరం బండి సంజయ్‌ను నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ప్రస్తుతం బండి సంజయ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఇంటికే పరిమితమైన బండి సంజయ్.. పాదయాత్ర నిర్వహణపై పార్టీ నేతలతో సమాలోచనలు జరపుతున్నారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చేవరకు వేచి చూసే ధోరణిలో ఉండాలని బండి సంజయ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, పాదయాత్రకు తొలుత పోలీసులు అనుమతి ఇచ్చారని.. అయితే అన్ని ఏర్పాట్లను చేసిన తర్వాత అనమతి నిరాకరించారని బండి సంజయ్ చెబుతున్నారు. భైంసా సున్నితమైన ప్రాంతం అంటున్నారనీ.. అదేమైనా నిషేధిత ప్రాంతమా? అని ప్రశ్నించారు. పోలీసుల అభ్యర్థన మేరకు తాను కరీంనగర్‌కు తిరిగి వచ్చానని చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన శాంతియుతంగా పాదయాత్రతో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు.
 

click me!