ప్రధాని మోడీ కోసం ప్రత్యేకంగా పిలుపు.. వంట మాస్టర్ యాదమ్మకు అవమానం, నోవాటెల్ లోకి ‘‘ నో ఎంట్రీ ’’

By Siva KodatiFirst Published Jul 2, 2022, 5:55 PM IST
Highlights

తెలంగాణ వంటకాల స్పెషలిస్ట్ యాదమ్మకు హైదరాబాద్ నోవాటెల్ వద్ద అవమానం జరిగింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆమెను లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో యాదమ్మ తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. 

హైదరాబాద్ నోవాటెల్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల (bjp national executive meeting) సందర్భంగా తెలంగాణ వంట మాస్టర్ యాదమ్మకు (yadamma) అవమానం జరిగింది. వంట చేయడంలో ఎక్స్‌పర్ట్ అయిన ఆమెను ప్రధానికి (narendra modi) తెలంగాణ రుచులు చూపించేందుకు యాదమ్మను పిలిపించారు. ఈ క్రమంలో పాస్ లేదంటూ నోవాటెల్ లోకి వెళ్లకుండా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో యాదమ్మ తన అనుచరులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. 

ఇకపోతే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని ఆ పార్టీ రాష్ట్ర నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు హైదరాబాద్ కు తరలివస్తుండటంతో అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అతిథులకు తెలంగాణ రుచులను వడ్డించనున్నారు. ఇందుకోసం కరీంనగర్ జిల్లాకు చెందిన పాకశాస్త్ర నిపుణురాలు యాదమ్మను పిలిపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) . 

Also REad:తెలంగాణకు మోడీ.. యాదమ్మను పిలిపించిన బండి సంజయ్, అతిథుల కోసం స్పెషల్ మెనూ

గత 29 సంవత్సరాలుగా వంటలు చేయడంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించిన యాదమ్మ స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. 15 ఏళ్లకే పెళ్లి కావడంతో అత్తారిల్లు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ కు వచ్చేసి అక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు చేయడం నేర్చుకుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలు చేయడంలో యాదమ్మ స్పెషలిస్ట్. కరీంనగర్ జిల్లా , ఆ చుట్టుపక్కల ఎంతో పేరు తెచ్చుకున్న యాదమ్మ.. ఇప్పుడు వీఐపీ చెఫ్ గా మారిపోయారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యక్రమాలతో పాటు రాజకీయ నేతల ఇళ్లల్లో జరిగే పలు వేడుకలకు యాదమ్మ వంటలు చేసేవారు. అలా ఆమె పేరు రాజకీయ వర్గాల్లోనూ మారుమోగింది. 

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించే సామూహిక కార్యక్రమాలకు యాదమ్మ చేతి వంటలనే రుచి చూపిస్తారు. చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో పర్వదినాల సందర్భంగా ఏర్పాటు చేసే సామూహిక భోజన కార్యక్రామానికి కూడా యాదమ్మ వంటలు చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ అతిథులకు ఆమె చేతి రుచిని చూపించనున్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఆమెను హైదరాబాద్ కు రప్పించుకున్నారు. కొన్ని వంటకాలను చేయించుకున్న బండి సంజయ్ సూచనలు ఇచ్చారు. ఏకంగా దేశ ప్రధానికి తన చేతులతో చేసిన వంటకాలను రుచి చూపించనుండటంతో  యాదమ్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల సందర్భంగా పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి వంటలు, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, సాంబారు, గుత్తి వంకాయ కూ, సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పుగారెలు వంటి వటకాలను చేస్తామని యాదమ్మ తెలిపారు. 

click me!