
హైదరాబాద్ నగరంలోని మంగళ్‌హాట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గొడవ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. మొత్తం 30 మంది వరకు గొడవలో పాల్గొన్నట్టుగా గుర్తించారు. ఒక్కొక్కరిని గుర్తించి.. పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఈ కేసులో పట్టుకున్నవారిపై అంటెప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా బీజేపీ కార్పొరేటర్ శశికళ, ఏ2గా యోగేష్‌లను చేర్చారు.
అసలేం జరిగిందంటే.. బోనాల పండగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇవరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన సంతోష్ గౌడ్ గురువారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేయవద్దని వాదించాడు. దీంతో ఇరువర్గాలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో ఒక వ్యక్తి తలకు బలమైన గాయం కాగా.. మరికొందరు స్పల్పంగా గాయపడ్డారు.
ఇక, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇరువర్గాల మధ్య ఘర్షణను అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఓ వర్గం ఫిర్యాదులో.. ఇందులో మంగళ్‌హాట్ కార్పొరేటర్ శశికళకృష్ణ ఉన్నట్టుగా పేర్కొంది. ఈ క్రమంలోనే పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు.