కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు కొన్ని వర్గాలు చెప్పాయి. నిజామాబాద్ అర్బన్ సీటు నుంచి లేదా బోధన్ అదీ కాకుంటే జగిత్యాల నుంచి ఆమె శాసన సభకు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నట్టు తెలుస్తున్నది. నిజామాబాద్ అర్బన్ సీటు నుంచి పోటీ చేయనున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. మరో రెండు ఆప్షన్లు కూడా ఉన్నట్టు ఆ చర్చ ద్వారా తెలుస్తున్నది. నిజామాబాద్‌లోని బోధన్ నుంచి లేదా జగిత్యాల జిల్లా నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
సిట్టింగ్‌లకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు హామీ ఇచ్చారు. సిట్టింగ్‌లలోనూ ఈ హామీనే ధైర్యాన్ని నింపింది. అందుకే ప్రజల్లోకెళ్లాలని, గ్రాఫ్ పెంచుకోవాలని కేసీఆర్ సూచనలు చేశారు. దీంతో సిట్టింగ్‌లు మళ్లీ టికెట్ తమకే అనే ధీమాలోనైతే ఉన్నారు. కానీ, కొందరిలో అనుమానాలు లేకపోలేవు. టికెట్ ఇవ్వనిపక్షంలో ఎలా అనే ఆలోచనల్లోనూ ఉన్నారు. అయితే.. వేరే పార్టీలోకి జంప్ అయి.. ఆ పార్టీ టికెట్ పై పోటీ చేయడం, లేదా తమ భవితను కేసీఆర్ చేతిలో పెట్టి పార్టీలో కొనసాగడం అనే ఆప్షన్లను అభ్రదతతో ఉన్న ఎమ్మెల్యేలే పెట్టుకున్నట్టు తెలుస్తున్నది.
ఒక వేళ సీఎం కేసీఆర్ సిట్టింగ్‌లకు కాకుండా ఎమ్మెల్సీలకు టికెట్లు ఇస్తే కనీసం 15 మంది సిట్టింగ్‌లు తమ టికెట్ కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్సీలకూ బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందనే వాదనలూ బలంగానే ఉన్నాయి. మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్‌లతోపాటు ఎమ్మెల్సీ కవితకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే చర్చ కూడా బలంగా జరుగుతున్నది. ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా బిగాల గణేశ్ గుప్తా ఉన్నారు.
Also Read: Tomatoes: టమాటలు అమ్మి నెల రోజుల్లో కోటీశ్వరుడైన రైతు.. ఎక్కడంటే?
అంతేకాదు, కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఓ వైపు ఉంటే.. వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వాదనలు మరో వైపు ఉన్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యక్తిగతంగా కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనూ ఆగ్రహాన్ని తెప్పించాయి. ప్రస్తుత ఎంపీకి సవాల్‌గా నిజామాబాద్ ఎంపీ స్థానంలో కవిత నిలబడి గెలవాలని అనుకుంటున్నట్టూ కొన్ని వర్గాలు చెప్పాయి. ఇటీవలే బీఆర్ఎస్ నేతలూ ఇందుకు సంబంధించి కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఆర్మూర్ సెగ్మెంట్‌లో గతంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి.. ప్రజలు కవితక్కకు ఓటేసి గెలిపించాలని కోరడం చర్చనీయాంశమైంది.