
వరంగల్: తెలంగాణ పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుకు సంబంధించి టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. బండి సంజయ్‌ను ఈ కేసులో నిందితుల జాబితాలో చేర్చారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 420, సెక్షన్ 6 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ కేసులో నిందితునిగా ప్రశాంత్.. బండి సంజయ్‌ల మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను పోలీసులు రిట్రీవ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రశాంత్ నుంచి బండి సంజయ్‌కు పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లినట్టుగా కూడా తెలుస్తోంది. పేపర్ లీక్ జరగడానికి ముందు రోజు బండి సంజయ్‌తో ప్రశాంత్ ఫోన్‌లో మాట్లాడినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అలాగే మంగళవారం రోజున బండి సంజయ్‌ను పేపర్ పంపిన తర్వాత కూడా ప్రశాంత్ ఆయనతో మాట్లాడినట్టుగా గుర్తించారు.
ఇక, బండి సంజయ్‌ను ఈరోజు ఉదయం బొమ్మలరామారం పోలీసు స్టేషన్ నుంచి తరలించారు. ఆయనకు పాలకుర్తి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం వరంగల్ వైపు తరలించారు. బండి సంజయ్‌ను హన్మకొండలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్న పోలీసులు ఆయన కస్టడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. 10వ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం యొక్క ఫోటోలు వాట్సాప్ గ్రూపులలో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. హన్మకొండలోని కమలాపూర్‌లోని పరీక్షా కేంద్రంలో లీక్ జరిగినట్లు గుర్తించామని పోలీసు అధికారి తెలిపారు. వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒక మైనర్ బాలుడు చెట్టు ఎక్కి పరీక్ష జరుగుతున్న మొదటి అంతస్తులోని తరగతి గదిలోకి ప్రవేశించాడు. అక్కడ పరీక్ష రాస్తున్న ఒక విద్యార్థి నుంచి కిటికీ ద్వారా హిందీ ప్రశ్నపత్రం అడిగి తీసుకున్నాడు. అక్కడే ఉన్న పిట్టగోడ మీద ప్రశ్నపత్రాన్ని ఉంచి తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు. అనంతరం దానిని తన స్నేహితుడు మెట్టు శివగణేశ్‌కు పోస్టు చేశాడు.
శివగణేష్ ఆ పేపర్‌ను ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశారు. ఆ గ్రూప్‌లో సభ్యునిగా ఉన్న మహేశ్ అనే వ్యక్తి.. దానిని మాజీ జర్నలిస్టు బూరం ప్రశాంత్‌కు పంపించాడు. దీంతో ప్రశాంత్ బ్రేకింగ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో దీనిని వైరల్ చేశాడు. ఈ పేపర్‌ను బండి సంజయ్‌తో పాటు చాలా మందికి ఫార్వర్డ్ చేశాడు’’ అని చెప్పారు.