త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై కమిటీ : మాదిగల సభలో, మందకృష్ణ సమక్షంలో మోడీ సంచలన ప్రకటన

Siva Kodati |  
Published : Nov 11, 2023, 07:10 PM IST
త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై కమిటీ : మాదిగల సభలో, మందకృష్ణ సమక్షంలో మోడీ సంచలన ప్రకటన

సారాంశం

త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీ వేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి తాము మద్ధతుగా వుంటామని మోడీ హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వున్నామని .. మాదిగలకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీ వేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి తాము మద్ధతుగా వుంటామని మోడీ హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వున్నామని .. మాదిగలకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభలో ఆయన ప్రసంగిస్తూ.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. 

పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అంబేద్కర్ ఫోటో కూడా కాంగ్రెస్ పెట్టనివ్వలేదని మోడీ దుయ్యబట్టారు. అంబేద్కర్‌ను రెండుసార్లు గెలవకుండా చేసింది కాంగ్రెస్సేనని.. ఆయనకు భారతరత్న కూడా ఇవ్వలేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా మందకృష్ణ ఒకే లక్ష్యం కోసం పోరాడుతున్నారని మోడీ చెప్పారు. కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదంతోనే తాను ప్రధానిగా మీ ముందు వున్నానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 

బీఆర్ఎస్ నేతల బంధువుల స్కీమ్‌గానే దళితబంధు మారిందని.. పదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసిందని మోడీ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ చరిత్ర కూడా బీసీలు, అణగారిణ వర్గాలకు వ్యతిరేకమని.. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి, ఆ హామీ నెరవేర్చలేదన్నారు. బీజేపీ ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆదివాసీ మహిళ అయిన ద్రౌపది ముర్మును ఓడించేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆయన ఎద్దేవా చేశారు. 

బలిదానాలు చేసిన వారిని కాదని.. కేసీఆర్ మొదట తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ధన్యవాదాలు చెప్పారని ప్రధాని మోడీ చురకలంటించారు. ఇండియా కూటమి నేత నితీశ్ కుమార్.. పాశ్వాన్, మాంఝీలను అవమానించారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రపతిగా దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించిందని ప్రధాని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్రం జాషువా తన కష్టాలను కాశీ విశ్వనాథుడికి విన్నవించుకున్నారని.. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య వుంటే.. ఆనందం రెట్టింపు అవుతుందని ప్రధాని చెప్పారు. 

ఇన్నాళ్లు రాజకీయ పార్టీలు వాగ్థానాలు చేసి, మాట తప్పినందుకు క్షమించమని అడుగుతున్నానని మోడీ వ్యాఖ్యానించారు. పదేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం మాదిగల్ని మోసం చేసిందని ఆయన ఆరోపించారు. దళితబంధు వల్ల ఎంతమందికి లాభం జరిగిందని ప్రధాని ప్రశ్నించారు. ఆప్‌తో కలిసి బీఆర్ఎస్... లిక్కర్ స్కామ్ చేసిందని మోడీ ఆరోపించారు. పేదవారికి ఉచిత రేషన్‌ను మరో పదేళ్లు కొనసాగిస్తామన్నారు. పదేళ్ల కింద ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ.. ఇక్కడి ప్రజల ఆకాంక్షాలను నెరవేర్చలేదని ఆయన దుయ్యబట్టారు. 

బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఒకవైపు.. బీజేపీ రెండోవైపు వుందని మోడీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చాక అనేక ప్రభుత్వాలు వచ్చాయని.. అవకాశవాద రాజకీయాలతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన హెచ్చరించారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని.. అభివృద్దిలో భాగస్వాములు కారు కానీ.. స్కామ్‌ల్లో మాత్రం వీళ్లంతా కలిసిపోతారని మోడీ చురకలంటించారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ రెండూ ఒకటేనని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్‌తో ఎంత జాగ్రత్తా వుంటారో.. కాంగ్రెస్‌తోనూ అంతే జాగ్రత్తగా వుండాలని మోడీ సూచించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !