ప్రధాని మోడీ దళిత విశ్వరూప మహాసభలో మాట్లాడుతూ గుర్రం జాషువా ప్రస్తావన చేశారు. ఆయన రాసిన గబ్బిలాన్ని గుర్తు చేశారు. దళితుడి దురవస్తను కాశీ విశ్వనాథుడికి తెలియజేయాలని గబ్బిలానికి వాటిని వివరించడమే ఈ గబ్బిలం సారాంశంగా ఉంటుంది. అయితే.. తాను కాశీ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉన్నదని, ఆ కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదంతోనే దళిత సమూహం మధ్యలోకి వచ్చినట్టు అనుకుంటున్నానని చెప్పారు.
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో మాట్లాడారు. అణగారిన వర్గాల విశ్వరూప మహా సభలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ కవి గుర్రం జాషువాను ప్రస్తావించారు. గుర్రం జాషువా రాసిన ప్రసిద్ధ రచన గబ్బిలం గురించి మాట్లాడారు. గుర్రం జాషువా గబ్బిలంతో తన పర్యటనకు లింక్ పెట్టి మాట్లాడారు. ఇంతకీ గుర్రం జాషువా తన గబ్బిలంలో ఏం రాశారు. దానికి ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు ఏమిటీ సంబంధం?
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వినుకొండలో 1895లో జన్మించిన గుర్రం జాషువా దళితుల దురవస్థను దీనంగా వర్ణిస్తూ రాసిన రచనే గబ్బిలం. 1941 నాటి ఆయన రచనల్లో గబ్బిలం ప్రముఖమైంది. అంటరానితనం, దళితులపై అమలయ్యే వివక్షను హృద్యంగా అందులో వర్ణించారు. దళితులకు అప్పుడు ఆలయ ప్రవేశం లేదు. కానీ, ఆలయంలోకి వెళ్లకుండా గబ్బిలాన్ని ఎవరూ ఆపలేరు. గబ్బిలం కూడా ఇతర పక్ష సమూహాల నుంచి దూరంగా చీకటిలో నివసిస్తుంది. ఈ పక్షి సహకారంతో గుర్రం జాషువా దళితుల సామాజిక దుస్థితిని వివరించారు.
గబ్బిలం నవలలో ఒక దళితుడి బాధలను కాశీలోని విశ్వనాథుడికి తెలియజేయాలని గబ్బిలం ద్వారా సందేశం పంపుతారు. ఈ క్రమంలో ఆ దళితుడు తన బాధలను గబ్బిలానికి చెబుతూ ఉంటారు. సమాజంలో తాను పడే శ్రమను వివరిస్తూ దాని ఫలాలకు ఎంత దూరంగా నెట్టివేయబడ్డాడో వివరిస్తూ బాధపడుతాడు. తన గోడును కాశీ విశ్వనాథుడికి తెలియజేయాలని గబ్బిలానికి చెబుతూ ఉంటారు.
తాజాగా ప్రధాని మోడీ ఈ గబ్బిలం రచనను తన ప్రసంగంలో ప్రస్తావించారు. గుర్రం జాషువా దళితుల బాధలను వివరించి వాటిని కాశీ విశ్వనాథుడికి చెప్పాలని సందేశం పంపినట్టు తనకు చెప్పారని ప్రధాని మోడీ చెప్పారు. ఇప్పుడు తాను ఆ కాశీ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాని వివరించారు. ఆ కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదంతోనే తాను ఇప్పుడు దళిత సమూహం మధ్యలోకి వచ్చానని అనుకుంటున్నట్టు తెలిపారు. కాశీ ఎంపీగా తాను ఇప్పుడు దళిత సమూహం మధ్యలోకి రావడం తనకు సంతోషంగా ఉన్నదని వివరించారు.