ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదు : మోడీ సమక్షంలో కంటతడిపెట్టిన మందకృష్ణ మాదిగ

Siva Kodati | Published : Nov 11, 2023 6:20 PM

తమ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని తాము ఊహించలేదన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. మాదిగలను ఇప్పుడిప్పుడే చైతన్య పరుస్తున్నామని, ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు.

Google News Follow Us

తమ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని తాము ఊహించలేదన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగిస్తూ.. బలహీనవర్గాలకు అండగా వుండే పార్టీ బీజేపీయేనని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కేవలం మాటలే చెబుతున్నాయని.. మా ఆకాంక్షలు నెరవేర్చేది బీజేపీయేనని మందకృష్ణ పేర్కొన్నారు. 

మాదిగలను ఇప్పుడిప్పుడే చైతన్య పరుస్తున్నామని, ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా చూడలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. మాదిగల ఉపకులాల సభకు వచ్చిన ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటకు నిలబెట్టుకునే నేత మోడీ అని ప్రశంసించారు. దళిత, గిరిజన బిడ్డలను రాష్ట్రపతులను చేసిన ఘనత ప్రధాని మోడీదేనని.. బలహీనవర్గాల కష్టాలు ప్రధాని మోడీకి బాగా తెలుసునని కొనియాడారు. మోడీకి సామాజిక స్పృహ వుంది కనుకే ఈ సభకు వచ్చారని.. తెలంగాణకు బీసీని , సీఎంగా చేస్తామని ప్రకటించింది బీజేపీయేనని మందకృష్ణ మాదిగ ప్రశంసించారు. 

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత మోడీదేనని.. తమిళనాడులో ఎన్నికల్లో ఓడిన మురుగన్‌ను కేంద్ర మంత్రిగా చేశారని చెప్పారు. మోడీ గుండె గట్టిదని.. మనసు మాత్రం వెన్నపూస అని, మోడీని మించిన నాయకుడు లేరని మందకృష్ణ కొనియాడారు. మోడీ మాట ఇస్తే తప్పరని ప్రజల్లో బాగా విశ్వాసం వుందని ఆయన తెలిపారు. 
 

Read more Articles on