ఎస్సీ వర్గీకరణపై చర్చ మొదలైన నేపథ్యంలో అసలు పార్టీలు ఎస్సీలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తున్నాయనే ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రంలో 19 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్‌డ్‌గా ఉన్నాయి. వీటికి మించి ఏ పార్టీ అదనంగా ఎస్సీలకు టికెట్లు కేటాయిస్తున్నాయనే చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంలోనే రాష్ట్రంలో అసెంబ్లీ బరిలో ఉన్న ప్రధానమైన మూడు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల వివరాలు చూద్దాం.
హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్‌లో ఈ రోజు మాదిగల విశ్వరూప సభ చర్చను లేవదీస్తున్నది. మరోసారి రిజర్వేషన్ల అంశాన్ని ఈ సభ ముందుకు తెచ్చింది. ఈ సభలో ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధ కల్పిస్తామని హామీ ఇస్తారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అన్ని పార్టీలూ ఎస్సీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నాయి. బీఆర్ఎస్ మాత్రం దళిత బంధును ప్రముఖంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధిస్తున్నది. బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ఇక్కడ బలమైన పునాదిని నిర్మించుకోవడానికి బీసీ నినాదంతోపాటు ఇప్పుడు వర్గీకరణ అంశాన్ని ప్రధాన ఎజెండాలోకి తెచ్చింది.
రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 19 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు. ఈ స్థానాల్లో ఎస్సీలను బరిలోకి దింపడం తప్పనిసరి. కచ్చితంగా నిలబెట్టాలి కాబట్టి ఎస్సీ నేతలకు టికెట్లు ఇవ్వడం కాకుండా.. జనరల్ స్థానాల్లో ఏ పార్టీ ఎంతమంది ఎస్సీ నేతలకు టికెట్లు ఇచ్చాయనే చర్చ ఈ మాదిగల విశ్వరూప సభతో ముందుకు వచ్చింది.
తెలంగాణలో ఎస్సీల ఓట్లు 18 శాతం ఉన్నాయి. అందులో 14 శాతం మాదిగల ఓట్లు అని అంచనాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ నుంచి 20 మంది:
బీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఇందులో 60 సీట్లు ఓసీలకు (అత్యధికంగా 42 సీట్లు రెడ్డీలకు), బీసీలకు 24 సీట్లు బీఆర్ఎస్ కేటాయించింది. 19 రిజర్వ్‌డ్ స్థానాలతోపాటు మరో జనరల్ స్థానంలోనూ ఎస్సీ నేతకు టికెట్ కేటాయించింది. 12 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో ఎస్టీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. ముగ్గురు మైనార్టీలనూ బరిలోకి దించింది.
Also Read: మునుగోడులో కోమటిరెడ్డికి తిప్పలు.. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత, సీపీఎం ఫ్యాక్టర్
కాంగ్రెస్ నుంచి 19 మంది:
కాంగ్రెస్ పార్టీ 58 సీట్లు ఓసీలకు (అత్యధికంగా 43 సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి), 23 స్థానాలు బీసీలకు, 19 సీట్లు ఎస్సీలకు కేటాయించింది. ఈ 19 స్థానాల్లో పది మాదిగలకు, తొమ్మిది మాలలకు టికెట్లు ఇచ్చింది. 12 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో ఏడు టికెట్లు లంబాడాలకు, నాలుగు టికెట్లు కోయలకు, ఒకటి గోండుకు కేటాయించింది. ఆరు మైనార్టీలకు కేటాయించగా.. పొత్తులో భాగంగా ఒక్క సీటు సీపీఐకి వదిలిపెట్టింది.
బీజేపీ నుంచి 21 మంది:
బీజేపీ పై రెండు పార్టీల కంటే ఎక్కువ మొత్తంలో బీసీలకు, ఎస్సీలకు ఎక్కువ టికెట్లు కేటాయించింది. 36 స్థానాల్లో బీసీలకు టికెట్లు కేటాయించింది. ఎస్సీలకు రిజర్వ్‌డ్‌గా ఉన్న 19 స్థానాలతోపాటు మరో రెండు స్థానాల్లో ఎస్సీ అభ్యర్థులను బరిలోకి దింపింది.