నేడు హైదరాబాద్‌కు మోదీ.. మాదిగ విశ్వరూప సభకు హాజరు.. ఎస్సీ వర్గీకరణపై ప్రకటన ఉంటుందా..?

By Sumanth Kanukula  |  First Published Nov 11, 2023, 10:30 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. వారం రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. వారం రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి. ఇటీవల బీజేపీ బీసీ ఆత్మగౌరవ  సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతనే ముఖ్యమంత్రిని చేస్తామనే మరోసారి స్పష్టం చేశారు. అయితే నేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎంఆర్‌పీఎస్) ఆధ్వర్యంలో జరిగే మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభకు మోదీ హాజరుకానున్నారు. ఈ వేదికపై నుంచే ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాన్ని మోదీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

పరేడ్ గ్రౌండ్‌లో మాదిగ విశ్వరూప సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. పోరాటం తుది దశకు చేరుకుందని చెప్పారు. పరేడ్ గ్రౌండ్ సభ వేదికగా ప్రధాని మోదీ నుంచి కచ్చితమైన హామీ లభిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక, ప్రధాని మోదీ కొన్ని నెలల కిందట వరంగల్‌ పర్యటనకు వచ్చిన సమయంలో మందకష్ణ మాదిగ ఆయనను కలిసిన సంగతి తెలిసిందే. అయితే దళిత ఉప కులాల జనాభాకు సంబంధించి ప్రత్యేక సర్వే నిర్వహించాలని, వారి సంఖ్యా బలానికి అనుగుణంగా కోటాలు కల్పించాలని ఎంఆర్‌పీఎస్ డిమాండ్‌ చేస్తుంది. 

Latest Videos

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పరేడ్ గ్రౌండ పరిసరాల్లో భారీ భద్రత చర్యలు చేపట్టారు. పరేడ్‌ గ్రౌండ్‌ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సభకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా సహా తొమ్మిది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యల ప్రజలను సమీకరించినట్లు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నామని, మాదిగ సామాజికవర్గానికి అనుకూలంగా మోదీ ప్రకటన చేస్తారని ఆశిస్తున్నట్టుగా నాగరాజు చెప్పారు. 

click me!