
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న కామెంట్‌తోనే తీవ్ర ఆరోపణలకు చెక్ పెట్టారు. ‘తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె బాగుపడాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి.. మీ కుటుంబం, మీ పిల్లలు బాగుపడాలంటే మాత్రం బీజేపీకి ఓటు వేయాలి’ అని అన్నారు. కుటుంబ రాజకీయాలపై విమర్శలు చేస్తూ ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడ్డారు. పలు ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి.. కేసీఆర్‌ను ప్రస్తావించే సమయంలో నెమ్మదించారు. కేసీఆర్ కుమార్తె బాగుపడాలంటే.. బీఆర్ఎస్‌కు ఓటేయండని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వర్సెస్ కేంద్రం అన్నట్టుగా పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డప్పుడు.. కేసీఆర్ తరుచూ ప్రెస్ మీట్లు పెట్టి ఎండగట్టారు. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకతవకల కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు వచ్చింది. ఈడీ దర్యాప్తు చేపట్టడం మొదలు పెట్టింది. అప్పుడే మోయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు బయటకు వచ్చింది. రాష్ట్రం, కేంద్రం మధ్య వార్ బలంగా జరిగింది. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు రావడం, ఆమె ఢిల్లీ వెళ్లి విచారణకు హాజరై రావడం జరిగింది. ఇవాళ అరెస్టు, రేపు అరెస్టు అన్నట్టుగా పరిస్థితులు మారాయి. అందరూ అదే అనుకున్నారు. కానీ, ఈడీ ఆమెను అరెస్టు చేయకపోవడం బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఏదైనా అవగాహన ఉన్నదా? అనే అనుమానాలను రేకెత్తించాయి. కాంగ్రెస్ బలంగా ఆరోపణలు చేయడంతో.. ఈ అనుమానాలు ఉధృతం అయ్యాయి.
Also Read: మోడీ నా 15వ కొడుకు.. ఆయనకు 15 ఎకరాలు రాసిస్తా: మధ్యప్రదేశ్ వృద్ధురాలు
తెలంగాణ బీజేపీ నేతలు స్వయంగానూ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదన్న అనుమానాలు ప్రజల్లోకి వెళ్లాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఢిల్లీలో తెలంగాన బీజేపీ నేతలు సమావేశమైనప్పుడూ ఈ విషయాలను చర్చించినట్టు తెలిసింది. బలహీన పడిన తెలంగాణ బీజేపీని మళ్లీ గాడిన పెట్టడానికి దానిపై వచ్చిన ఆరోపణలను తొలగించడంలో భాగంగానే ప్రధాని మోడీ పై వ్యాఖ్యలు సందర్భోచితంగా చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
తద్వారా బీఆర్ఎస్, బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధం లేదని, పరస్పరం ఢీ అంటే ఢీ అన్నట్టుగానే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయనే సంకేతాలను స్పష్టంగా ఇచ్చారు. మొన్న నాగర్ కర్నూల్ సభలోనే జేపీ నడ్డా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.