
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. తదితరులు స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని మోదీ నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని మోదీ పెరేడ్ గ్రౌండ్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోనున్నారు. దీంతో ఆ మార్గంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అలాగే వర్చువల్‌గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఇక, తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. అయితే మోదీ అధికారిక పర్యటన కావడంతో.. పరేడ్ గ్రౌండ్‌లో ఆయన పాల్గొనే బహిరంగ సభలో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేశారు. వేదికపై ప్రధాని మోదీతో పాటు ప్రోటోకాల్ ప్రకారం పలువురికి చైర్‌లను ఏర్పాటు చేశారు. వేదికపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిలతో(స్థానిక ఎంపీ) మరికొందరు కూర్చునేలా చైర్‌లను ఉంచారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు.