
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. తన రెండు గంటల పర్యటనలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళతారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అక్కడి నుంచి వర్చువల్‌గా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Also Read: ‘మీ పరివారం మీకు ఆహ్వానం పలుకుతోంది’.. మోదీ పర్యటన వేళ.. వివాదాస్పద ఫ్లెక్సీలు..
అయితే మోదీ అధికారిక పర్యటన కావడంతో.. పరేడ్ గ్రౌండ్‌లో ఆయన పాల్గొనే బహిరంగ సభలో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేశారు. వేదికపై ప్రధాని మోదీతో పాటు ప్రోటోకాల్ ప్రకారం పలువురికి చైర్‌లను ఏర్పాటు చేశారు. వేదికపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిలతో(స్థానిక ఎంపీ) మరికొందరు కూర్చునేలా చైర్‌లను ఉంచారు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ అధికారిక పర్యటన నేపథ్యంలో కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు. అలాగే వేదికపై మధ్యాహ్నం 12.30 నుంచి 12.37 గంటల వరకు కేసీఆర్‌కు మాట్లాడేందుకు సమయం కేటాయించారు.
అయితే సీఎం కేసీఆర్.. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రధాని పర్యటన కోసం ఇన్‌వెయిటింగ్ మంత్రిగా నియమించింది. దీంతో బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి మంత్రి తలసాని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలకనున్నారు. అలాగే తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు పలకనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ సభకు కేసీఆర్ దూరంగా ఉండనున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే సభా వేదికపై ప్రోటోకాల్ ప్రకారం కుర్చీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.