
భైంసా : పెళ్లి పత్రిక అనగానే.. దాంట్లో కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు.. బంధుమిత్రుల శుభాకాంక్షలు.. తల్లిదండ్రుల దీవెనలు.. లేదంటే ఇంట్లోనే పెద్దవారి ఆశీస్సులు అంటూ ముద్రిస్తుంటారు. కానీ తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైంసాలో ఓ యువకుడు మాత్రం తన పెళ్లి పత్రికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోటోలను ముద్రించాడు. వారి మీద తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఉంటున్న గంగాప్రసాద్ బిజెపి వీరాభిమాని. అతని వివాహం ఫిబ్రవరి 24వ తేదీన జరగనుంది. ఈ క్రమంలోనే తన పెళ్లి ఆహ్వాన పత్రికల్లో నరేంద్ర మోడీ, బండి సంజయ్ల ఫోటోలను ముద్రించాడు. ఈ పత్రికను తన బంధుమిత్రులు స్నేహితులకు పంచి పెడుతున్నాడు. అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అతని వీరాభిమానానికి ముక్కున వేలేసుకుంటున్నారు.
అయితే, ఇలా పెళ్లి పత్రికలపై మోడీ బొమ్మను ముద్రించడం ఇది మొదటిసారి కాదు. ఈ ట్రెండ్ ను మొదట భైంసాకు చెందిన ఎడ్ల మహేష్ అనే వ్యక్తి మొదలు పెట్టాడు. తన పెళ్లి పత్రికలో మోడీ ఫొటో వేసి అభిమానాన్ని చాటుకున్నాడు. అప్పటినుంచి పలువురు యువకులు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. అలాగే గంగా ప్రసాద్ కూడా ముద్రించాడు. అదన్న మాట విషయం.