
ప్రజా యుద్ధనౌక, ప్రజాగాయకుడు గద్ధర్ హఠాన్మరణంతో తెలుగు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. జానపద గాయకుడిగా, సామాజిక కార్యకర్తగా ఆయన సమాజానికి ఎనలేని సేవలు అందించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడారు. మరోవైపు గద్దర్ మరణవార్త గురించి తెలుసుకున్న ఆయన అభిమానులు హైదరాబాద్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గద్ధర్ భౌతికకాయాన్ని అపోలో ఆసుపత్రి నుంచి ప్రజల సందర్శనార్ధం ఎల్బీ స్టేడియానికి తరలించారు. గేట్ నెం 6లో ఆయన భౌతికకాయాన్ని వుంచనున్నారు. మృతదేహం వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, వీహెచ్ తదితరులు వున్నారు.
కాగా.. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఆగస్ట్ 6న అమీర్‌పేట్‌లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో కన్నుమూశారు. అయితే కొద్దిరోజుల క్రితమే గద్ధర్ గుండెపోటుతో బాధపడుతూ అపోలోలో చేరారు. దీనికి గాను ఆపరేషన్ చేయించుకోగా.. అది సక్సెస్‌ఫుల్‌గా జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఆయన కోలుకుంటున్నారని.. తిరిగి వస్తారని అనుకుంటూ వుండగా గద్ధర్ తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అభిమానులు, ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ALso Read: గద్ధర్ మరణానికి కారణమిదే .. అపోలో వైద్యులు ఏమన్నారంటే, హెల్త్ బులెటిన్ ఇదే
ఈ నేపథ్యంలో అసలు గద్ధర్ మరణానికి కారణం ఏంటన్న దానిపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఊపిరితిత్తులు, మూత్ర సంబంధిత సమస్యలతోనే గద్ధర్ కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. తీవ్రమైన గుండెపోటుతో జూలై 20న ఆసుపత్రిలో చేరారని.. ఆగస్ట్ 3వ తేదీన బైపాస్ సర్జరీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే గతంలో వున్న ఊపిరితిత్తుల సమస్య ఈ సమయంలో తలెత్తడంతో కోలుకోలేక మరణించారని అపోలో వైద్యులు వెల్లడించారు.
కాగా.. గద్దర్‌గా సుపరిచితుడైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో ఆయన జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమకారుడిగా, గాయకుడిగా ఆయన తెలంగాణ సమాజంపై చెరగని ముద్రవేశారు. ముఖ్యంగా ఆయన రాసిన పాటులు ప్రజా చైతన్య ధివిటీలుగా వెలిగాయి.