
గద్దర్ విప్లవోద్యమ పాఠశాలలో తొలిగురువు సినీ దర్శకుడు బి నర్సింగరావు. గద్దర్ తొలినాళ్లలో నర్సింగరావు పరిచయమే ఆయనకు మార్గనిర్దేశం చేసింది. గద్దర్‌కు మొట్టమొదట అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన అనే పుస్తకాన్ని చేతిలో పెట్టి దిశా నిర్దేశం చేసిన వ్యక్తి నర్సింగరావే. నర్సింగరావు ఉమ్మడి మెదక్ జిల్లాలో భూస్వామి భూపతి కుమారుడు. కానీ ఆయన తన కుటుంబ నేపథ్యం వదిలి ప్రజా జీవితాన్ని ఎంచుకున్నారు. నర్సింగరావు జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్‌లో వామపక్ష విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.
Also Read: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత..
నర్సింగరావు ఏర్పాటు చేసిన ఆర్ట్ లవర్స్ అసోసియేషన్.. విప్లవ సానుభూతిపరులైన రచయితలు, మేధావులు నిరంతర చర్చలకు వేదికగా నిలిచింది. జననాట్యమండి ఏర్పాటులో నర్సింగరావుతో పాటు గద్దర్ పాలుపంచుకున్నారు. అయితే ఎమర్జెన్సీ కాలంలో బి నర్సింగరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే గద్దర్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. విడుదలైన తర్వాత మళ్లీ గద్దర్ జననాట్యమండలి వైపు వెళితే.. బి నర్సింగరావు సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. అయినప్పటికీ నర్సింగరావు గద్దర్‌కు తోడు నీడగా నిలిచారు.
Also Read: 25 ఏళ్లకు పైగా శరీరంలో బుల్లెట్‌తోనే గద్దర్ జీవనం.. 1997లో అసలు ఏం జరిగింది..?
ఇక, గౌతమ్ ఘోష్ తెరకెక్కించిన మా భూమి చిత్రంలో గద్దర్ కనిపించారు. ఈ సినిమాలో వచ్చే బండెనక బండి కట్టి పాటను గద్దర్ పాడారు. అలాగే ఈ చిత్రంలో కూడా ఆయన నటించారు. ఆ పాట ఎంతో ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రానికి నర్సింగరావు స్క్రీన్ ప్లే అందించారు. ఇక, ఆ తర్వాత బి నర్సింగరావు దర్శకత్వం వహించిన రంగుల కల చిత్రంలో.. భద్రం కొడుకో వంటి పాటను గద్దర్ పాడారు.
బి నర్సింగరావుతో గద్దర్( ఫొటో- సుప్రభాతం సౌజన్యంతో)
గద్దర్‌తో ఇంతటి అనుబంధం కలిగి ఉన్న బి నర్సింగరావు.. గద్దర్ మరణంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘నేను తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాను. నా భావాలను వ్యక్తీకరించడానికి నాకు పదాలు లేవు’’ అని నర్సింగరావు పేర్కొన్నారు. ‘‘ఆయన నాకు సోదరుడి కంటే ఎక్కువ. మేము ప్రజల సమస్యల గురించి చర్చించాము మా థియేటర్ గ్రూప్ ద్వారా వారికి జ్ఞానోదయం కలిగించడానికి ప్రయత్నించాము. నేను సినిమాల వైపు వచ్చినప్పుడు.. ఆయన ఎల్లప్పుడూ సామాన్యులతో కనెక్ట్ అవ్వాలని కోరుకున్నారు. ఆయన గొప్ప సేవను కొనసాగించాడు’’ అని నర్సింగరావు అన్నారు. ఆయన పాటలు ఎప్పటికీ గుర్తిండిపోతాయని అన్నారు. తనకు స్నేహితుడు కావడంతో నా చిత్రాల్లో పాటలకు గద్దర్ తిరస్కరించలేకపోయాడని చెప్పారు. గద్దర్‌కు రంగస్థల అనుభవం ఉన్నందున ఆ పాటలను గాంభీర్యంతో ఆలపించారని గుర్తుచేసుకున్నారు.