Telangana: 2014లో మోడీని ఎన్నుకుని ప్ర‌జ‌లు పెద్ద తప్పు చేశారు.. బీజేపీపై కేటీఆర్ ఫైర్

Published : Feb 19, 2022, 05:05 PM IST
Telangana: 2014లో మోడీని ఎన్నుకుని ప్ర‌జ‌లు పెద్ద తప్పు చేశారు.. బీజేపీపై కేటీఆర్ ఫైర్

సారాంశం

 Telangana: తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై తీవ్ర విమ‌ర్శ‌ల‌తో రెచ్చిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీని ప్ర‌ధానిగా ఎన్నుకుని  ప్ర‌జ‌లు పెద్ద త‌ప్పు చేశారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.   

 Telangana: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇరు పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పిస్తూ.. రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీవ్ర విమ‌ర్శ‌ల‌తో రెచ్చిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీని ప్ర‌ధాని ఎన్నుకుని  ప్ర‌జ‌లు పెద్ద త‌ప్పు చేశారంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు తీసుకువ‌స్తామ‌ని ఎన్నిక‌ల ముందు హామీలు కురిపించిన ప్ర‌ధాని మోడీ ఇప్పుడు.. ప్ర‌జ‌ల జీవితాల‌కు ర‌క్ష‌ణ‌గా నిలుస్తూ.. జీవిత ధీమా అందించే జీవిత బీమా కంపెనీని అమ్మెస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. 

రాజ‌న్న సిరిసిల్లా జిల్లాలో  తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఓ పంక్ష‌న్ హాల్ లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. పై వ్యాఖ్య‌లు చేశారు. 8 ఏండ్ల క్రితం పార‌ల‌మెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజుల‌ను గుర్తు చేసిన కేటీఆర్‌.. నేడు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు తెలంగాణ ఏర్పాటును ప్ర‌శ్నిస్తూ.. రాష్ట్ర ప్ర‌జ‌ల త్యాగాల‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆరోపించారు. బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించిన కేటీఆర్.. వారి బెదిరింపులకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదనీ, వారిని మూర్ఖులుగా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలకు ధీటుగా సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కేటీఆర్‌ సూచించారు. ‘‘తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వారే ప్రజల్లో సందేహాలు సృష్టిస్తున్నారు. కానీ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత ప్రగతిశీల, మోడల్ రాష్ట్రంగా అవతరించింది’’ అని కేటీఆర్ అన్నారు. 

ఇదిలావుండ‌గా, హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2022లో  తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు వర్చువల్‌గా జరిగే సదస్సులో పాల్గొనాల్సిందిగా మంత్రికి ఆహ్వానం అందింది. ఈ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్య వక్తగా హాజరవుతారు. ఫిబ్రవరి 20న సాయంత్రం 6.30 గంటలకు ఆయన ప్రసంగిస్తారు. ఈ సంవత్సరం కాన్ఫరెన్స్ థీమ్ "ఇండియా @ 2030 – ఎ ట్రాన్స్‌ఫార్మేషనల్ డికేడ్". తెలంగాణ సమర్థవంతమైన విధాన రూపకల్పన, వాటి అమలు, ఐటీ ఆధారిత తెలంగాణ వృద్ధి, వ్యాపారాన్ని సులభతరం చేయడం, మహిళా కేంద్రీకృత వ్యాపార ఇంక్యుబేటర్లు, 2030 అభివృద్ధి విజన్‌పై మంత్రి కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఈ ఆహ్వానం పట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.. ఈ సదస్సులో తన ఆలోచనలను పంచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్ల‌డించారు. 

అలాగే, మంత్రి హరీష్ రావు సైతం బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖ‌రి స‌రిగా లేద‌నీ, రాష్ట్రానికి రావల్సిన నిధుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ల‌ను విడుద‌ల చేయాలంటూ..  మంత్రి హ‌రీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు శనివారం మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖ‌లో గుర్తు చేశారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu